NTV Telugu Site icon

KCR Enquiry: విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం.. బీఆర్‌కే భవనం వద్ద భారీగా పోలీసు బందోబస్తు..!

Kcr Enquiry

Kcr Enquiry

KCR Enquiry: తెలంగాణలో అత్యంత కీలకమైన విచారణలకు వేదికగా మారిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో నేడు (జూన్ 11) రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరవుతున్నారు. ఈ విచారణ రాజకీయంగా, పరిపాలనా వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Read Also: Papa Movie: తెలుగులో విడుదలకు సిద్దమైన ఎమోషనల్ మూవీ ‘పా..పా..’

ఇక విచారణకు ముందుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్‌ను కలిసి చర్చలు జరిపారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు నిన్న మధ్యాహ్నం నుంచే కేసీఆర్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. మరికొద్ది సేపట్లో కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరి బీఆర్‌కే భవన్ కు చేరుకుంటారు. జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలోని కమిషన్ ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్ (BRK Bhavan)లో కేసీఆర్‌ను విచారించనుంది. ఈ విచారణలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ నాణ్యత లోపాలు, ఆర్థిక అక్రమాలు, పాలనలో అవకతవకలపై ప్రశ్నలు ఎదురవనున్నట్లు సమాచారం.

Read Also: Road Accidents: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి, ఇద్దరు గాయాలు..!

కేసీఆర్ విచారణ సమయంలో బీఆర్‌ఎస్ నేతలు “చలో బీఆర్కే భవన్” కార్యక్రమానికి పిలుపునివ్వడంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతాల్లో వందలాది మంది మహిళా కానిస్టేబుళ్లతో సహా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు, ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, మాజీ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, మహమూద్ అలీ, బీఆర్ఎస్ నాయకుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్ వంటి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.