Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Gadeeee

Gadeeee

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీ గాదె వెంకటరెడ్డి (85) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకటరెడ్డి, శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

సౌమ్యుడు, సహనశీలిగా పేరుగాంచిన వెంకటరెడ్డి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు ప్రాతినిథ్యం వహించిన ఆయన, మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిదని సీఎం పేర్కొన్నారు.

×
×
Ad

రాజకీయ ప్రస్థానం..
1940 జులై 10న ప్రకాశం జిల్లా పావులూరులో జన్మించిన గాదె వెంకటరెడ్డి, న్యాయశాస్త్రం అభ్యసించారు. ప్రజాసేవపై ఆసక్తితో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 1967లో పర్చూరు నుండి తన 27వ ఏటనే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991 (ఉప ఎన్నిక), 1994లో పర్చూరు నుండి, అలాగే 2004, 2009లలో బాపట్ల నియోజకవర్గం నుండి విజయం సాధించారు.

నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయ శాఖతో పాటు పలు కీలక శాఖల మంత్రిగా ఆయన సమర్థవంతంగా సేవలందించారు. అనంతరం ఆయన టీడీపీ, వైఎస్సార్‌సీపీల్లోనూ కొనసాగారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.