Gyanvapi mosque: భారత పురావస్తు సర్వే (ASI) మాజీ ప్రాంతీయ డైరెక్టర్ కెకె ముహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత కొంత కాలంగా కొనసాగుతున్న మందిర్ – మసీద్ వివాదంపై స్పందించారు. ఈ వివాదంపై సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. రామ జన్మభూమి, మధుర, జ్ఞానవాపి మూడు స్థలాలు మాత్రమే చర్చకు కేంద్రంగా ఉండాలని కోరారు. హిందువులు మరిన్ని డిమాండ్లు చేయకుండా ఉండాలంటే ముస్లింలు ఈ ప్రాంతాలను ఇష్టపూర్వకంగా అప్పగించాలని సూచించారు. దేశవ్యాప్తంగా అనేక కోర్టుల్లో మందిర్-మసీద్ వివాదాలపై అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న సమయంలో ముహమ్మద్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Read Also: భారీ డిస్కౌంట్స్ ధరతో Vivo X300, X300 Pro ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ భారత్ లో లాంచ్.. ధర ఎంతంటే..?
జాతీయ మీడియాలో మాట్లాడుతూ… ముస్లింలకు మక్కా, మదీనా ఎలాగో హిందువులకు రామజన్మభూమి, మధుర, జ్ఞానవాపి అలాగే అని అన్నారు. 1976లో ఏఎస్ఐ ఉన్నతాధికారి బీబీ లాల్ నేతృత్వంలో బాబ్రీ మసీదు తవ్వకాల్లో తన ప్రమేయాన్ని గుర్తు చేసుకున్నారు. అయోధ్యలో సమస్య చాలా కాలంగా పెరిగిపోవడానికి ఒక కమ్యూనిస్ట్ చరిత్రకారుడు కారణమని, అతడే పురాతత్వ ఆధారాలను తిరస్కరించాలని ముస్లింలను ప్రభావితం చేశారని విమర్శించారు. మందిర్ మసీదు చర్చపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రామజన్మభూమి, మధుర, జ్ఞానవాపి ప్రాంతాలను హిందువులకు అప్పగించాలని అన్నారు. వాదనలు కొనసాగించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, మరింత సంఘర్షణకు దారి తీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఐక్యతకు ఏకైక పరిష్కారం ఈ మూడు ప్రాంతాలను అప్పగించడమే అని చెప్పారు. హిందువులు ఇతర స్థలాలను వివాదాలుగా చేయవద్దని అన్నారు.
తాజ్ మహల్ కింద ఆలయం ఉందనే కొన్ని హిందూ గ్రూపుల ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చారు. అవన్ని పూర్తిగా అబద్ధాలు అని కొట్టిపారేశారు. ఈ స్థలం మొదటగా రాజా మాన్ సింగ్ ప్యాలెస్ అని, తరువాత దీనిని జై సింగ్‌కు, తర్వాత షాజహాన్‌కు బదిలీ చేశారని, దీనికి సంబంధించిన సహాయక పత్రాలు బికనీర్, జైపూర్ మ్యూజియాల్లో భద్రపరిచి ఉన్నాయని అన్నారు. బీజేపీ కాలాన్ని భారత పురాతత్వ సర్వేకు చీకటి యుగంగా ఆయన అభివర్ణించారు. బీజేపీ ప్రభుత్వం నుంచి చాలా ఆశించామని, కానీ అవేవి జరగడం లేదని అన్నారు.
