Thief Jumps into Sea : దొంగలు దొంగతనం చేసిన తర్వాత తప్పించుకునేందుకు చాలా ప్లాన్లే వేస్తుంటారు. కొన్ని సార్లు వాళ్లు వేసే ప్లాన్లు వర్కవుట్ అవుతాయి. కొన్ని సార్లు దొరికి పోయి శిక్షలు అనుభవిస్తుంటారు. సాధ్యమైనంత వరకు వారు చిక్కకుండా ఉండేందుకు ఎంతకైనా తెగిస్తారు. కానీ కొంతమంది అతితెలివి దొంగలుంటారు చూడండి.. వాళ్లు చేసిన తిక్క పనులు చూస్తే ఎవరికైనా కొంచెం నవ్వు కొంచెం చిరాకు వస్తుంటుంది. అలాంటిదే ఈ వార్త..
ఫ్లోరిడాలో ఓ దొంగ దొంగతనం చేసి తప్పించుకునేందుకు ఏకంగా సముద్రంలోకి దూకాడు. అతను చేసిందేం పెద్ద దొంగతనమేమీ కాదు. జస్ట్ ఓ మహిళ వద్ద పర్సు కొట్టేశాడు. పర్సు లాక్కుని అతను పారిపోవడం.. ఆమె అరవడం.. పోలీసులు చూడటం.. వెంటపడటం వరుసగా జరిగిపోయాయి. అతను దొరక్కుండా పారిపోయేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. చివరికి సముద్రంలోనూ దూకి ఈత కొట్టడం మొదలుపెట్టాడు. కానీ పోలీసులు చేసినది చూసి చివరికి లొంగిపోయాడు. ఓ సినిమా సీన్ తరహాలో ఫ్లోరిడా సముద్ర తీరంలోని తంపా బే ప్రాంతంలో ఈ చోరీ, చేజింగ్ సీన్ జరిగింది. సదరు దొంగ పేరు డవేన్ డీన్. వయసు 32 ఏళ్లు. తంపా బే ప్రాంతంలోని ఓ హోటల్ వద్ద కారును పార్క్ చేసి కిందికి దిగిన మహిళ వద్ద పర్సును చోరీ చేశాడు. అతను దగ్గరిలోని బీచ్ వైపు పరుగెత్తడం చూసిన కొందరు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Read Also: Chicken Legs: కోడి కాళ్లను కరకర నమిలి రికార్డు కొట్టేసిందిగా
దీనితో పోలీసులు రంగంలోకి దిగారు. పెట్రోలింగ్ కార్లు, బైకులతో వెతుకుతూ వెంటపడ్డారు. పోలీసులకు దొరకవద్దని భావించిన దొంగ.. వెంటనే సముద్రంలో దూకి దూరంగా ఈదడం మొదలుపెట్టాడు. సుమారు 300 మీటర్ల వరకు లోపలికి వెళ్లాడు. ఇది గమనించిన పోలీసులు బోట్లతో సముద్రంలోకి దిగినా అతను ఎక్కడున్నది కనిపించలేదు. చివరికి హెలికాప్టర్ ను రంగంలోకి దింపారు.
Read Also:Andhra Pradesh: విశాఖ అల్లుడికి 125 వంటకాలతో అదిరిపోయే దసరా విందు
హెలికాప్టర్ సముద్ర తీరంలో ఎగురుతూ.. సదరు దొంగ ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది.దొంగ ఉన్న చోటికి హెలికాప్టర్ లో చేరుకున్న పోలీసులు.. ఇక తప్పించుకునే అవకాశమే లేదని, లొంగిపోవాలని స్పష్టం చేశారు. దీనితో రెండు చేతులు పైకి ఎత్తి లొంగిపోతున్నట్టుగా సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను స్థానిక పోలీసులు రికార్డు చేశారు. దొంగ లొంగిపోతున్న ఫొటోలతో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. సదరు దొంగ డ్రగ్స్ తీసుకుని ఉన్నాడని గుర్తించి ఆ కేసు కూడా నమోదు చేశారు. అయితే చిన్న పర్స్ కోసం పోలీసులు చేసిన పనికి స్థానికులు ఆశ్చర్య పోతున్నారు. దొంగపై ఇప్పటికే క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.