దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కళ్యాణ్ కృష్ణమూర్తి తన పదవి నుంచి వైదొలగనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థతో ఆయనకున్న సుదీర్ఘమైన 11 ఏళ్లకు పైగా ప్రస్థానానికి దీంతో తెరపడనుంది. రాబోయే కొద్ది వారాల్లో కొత్త సీఈఓ పేరును ప్రకటిస్తామని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. అప్పటివరకు మధ్యంతర బాధ్యతలను చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) బాలాజీ త్యాగరాజన్, ఫ్లిప్కార్ట్ బోర్డు కలిసి పర్యవేక్షించనున్నాయి.
వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్ వేగవంతమైన విస్తరణ దశలో కళ్యాణ్ కృష్ణమూర్తి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించారని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన హయాంలో కంపెనీ వ్యాపారం ఐదు రెట్లుకు పైగా వృద్ధి చెంది, భారతదేశపు అత్యంత పోటీతత్వ డిజిటల్ కామర్స్ రంగంలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ముఖ్యంగా ‘ది బిగ్ బిలియన్ డేస్’ వంటి వార్షిక విక్రయ వేడుకలను భారీ స్థాయిలో విస్తరించడంలోనూ, ద్వితీయ (టైర్-2), తృతీయ (టైర్-3) శ్రేణి నగరాలు, పట్టణాలకు ఫ్లిప్కార్ట్ సేవలను చేరువ చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. వినియోగదారులు, విక్రేతల కోసం అనేక నూతన సాంకేతిక సదుపాయాలను కూడా ప్రవేశపెట్టారు.
కళ్యాణ్ కృష్ణమూర్తి సేవలను వాల్మార్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, సీఈఓ క్రిస్ నికోలస్ ప్రత్యేకంగా అభినందించారు. కళ్యాణ్ నాయకత్వం, ఆయన నెలకొల్పిన పాలనా విలువల వల్ల ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ రెండూ మరింత బలోపేతమయ్యాయని, సంస్థకు ఆయన చేసిన సేవలకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటామని అన్నారు. మరోవైపు, తన ప్రయాణంపై స్పందించిన కళ్యాణ్ కృష్ణమూర్తి, బలమైన నైతిక విలువలు, సమగ్రత, అత్యుత్తమ పాలనా ప్రమాణాలే సంస్థ వృద్ధికి మూలస్తంభాలని పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయుల షాపింగ్ విధానాన్ని తమ బృందం మార్చిందని, దేశవ్యాప్తంగా ఉన్న విక్రేతలు, వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలను సృష్టించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపారు.

