Adaso Kapessa: మణిపూర్‌లోని ఒక మారుమూల గ్రామం నుండి జాతీయ భద్రతలో ముందంజలో ఉన్న ఆమె ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారతదేశం అంతటా మహిళలకు, ముఖ్యంగా సాంప్రదాయకంగా పురుషాధిక్య రంగాలలో అడ్డంకులను ఛేదించాలనుకునే వారికి స్ఫూర్తిదాయకమైనది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో ప్రధాని వెనుక నిలబడిన ఒకరు యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. నల్లటి సూట్, ఇయర్‌పీస్‌లో ఉన్న ఆ మహిళా ఆఫీసర్ ఫోటో వైరల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1985లో ఎస్పీజీ ఏర్పాటైనప్పటి నుంచి ఓ మహిళా అధికారిణి ఎస్పీజీలో డ్యూటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అసలు ఆ లేడీ ఆఫీసర్ ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: వీడియో : నిండు కుండలా హుస్సేన్ సాగర్
మణిపూర్ నుంచి ఎస్పీజీలో ఫస్ట్ లేడీ ఆఫీసర్ వరకు..
అదాసో కపేసా… యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనుక నిలబడిన లేడీ ఆఫీసర్. ఈమె స్వస్థలం మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని కైబి గ్రామం. అక్కడ పుట్టిపెరిగిన కపేసా తర్వాత హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర సాయుధ పోలీసు దళం సశస్త్ర సీమా బల్ (SSB)తో తన కెరీర్‌ను ప్రారంభించింది. తన కెరీర్ స్టార్టింగ్‌లో ఆమె ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్లో ఉన్న 55వ బెటాలియన్‌లో సేవలందించారు. ఆమె పనితీరు, అంకితభావం ఉన్నత అధికారుల దృష్టిని ఆకర్షించడంతో ఆమె అడుగులు ఎస్‌జీపీ వైపుకుమళ్లాయి. ఈ క్రమంలో ఆమెకు ఉన్నతాధికారలు నిర్వహించిన పలు కఠినమైన పరీక్షల్లో విజయవంతం అయ్యి, కమాండో శిక్షణ పొందిన తర్వాత ఎస్‌జీపీకి ఎంపికైంది. ఎస్జీపీలో కపేసా చేరే వరకు ఈ విభాగం పూర్తిగా పురుషులతో కూడి ఉండేది.
ఈక్రమంలోనే ఆమె నియామకం ఒక చారిత్రాత్మక మైలురాయిగా మారింది. యుద్ధ మెలకువలు, వ్యూహాత్మక నిఘా, హై సెక్యూరిటీ ప్రొటోకాల్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరు అంశాల్లో కచ్చితత్వం కనబర్చిన కపేసా ఎస్పీజీలో అడుగుపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన భద్రతాదళాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎస్పీజీ బృందంలో కపేసా ప్రవేశించడం వ్యూహాత్మకం, చరిత్రాత్మక నిర్ణయమని అంటున్నారు. ముఖ్యంగా భద్రతా బలగాల్లో స్త్రీ, పురుష భేదం లేదని నిరూపించే ప్రయత్నంగా దీనిని పేర్కొంటున్నారు. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిణి అయిన ఆమె ప్రస్తుతం ఎస్పీజీలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇన్స్పెక్టర్ అదాసో కపేసాను ఎస్జీపీలోకి చేర్చుకోవడం దేశ భద్రతా దళాల దృశ్యంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఆమె ఎంతో మంది మహిళలకు దేశ భద్రత, రక్షణలో కెరీర్లను ఎంచుకోడానికి ఆదర్శంగా నిలుస్తుంది. మణిపూర్‌లోని ఒక మారుమూల గ్రామం నుంచి ప్రధానమంత్రిని రక్షించేందుకు పక్కన నిలబడటం వరకు ఆమె ప్రయాణం నిజంగా ఎంతో మంది మహిళకు ప్రేరణగా నిలుస్తుంది. కృషి, దృఢ సంకల్పం, నైపుణ్యంతో వ్యవస్థాగత అడ్డంకులను అధిగమించి అసాధ్యం అనిపించే వాటిని సాధించవచ్చని ఆమె కథ నిరూపిస్తుంది సోషల్ మీడియాలో నెటీజన్లు పోస్టులు పెడుతున్నారు. ఎస్జీపీలో ఆమె నియామకం భవిష్యత్తులో మహిళలు భద్రతా రంగం వైపు రావడానికి మార్గం సుగమం చేస్తోందని నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు.
READ MORE: War 2: ఎర్లీ మార్నింగ్ షోస్.. YRF ‘OK’ కోసం వెయిటింగ్?