Site icon NTV Telugu

Fire In Vande Bharat Train :వందేభారత్ రైలులో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..

Vande Bharath Train

Vande Bharath Train

వందేభారత్ రైలులో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్‌లోని కుర్వాయి కేతోరా స్టేషన్‌ దగ్గర ఉదయం ఈ ఘటన జరిగింది.. రైలులో మంటలను గమనించిన సిబ్బంది వెంటనే లోకోపైలట్ కు సమాచారం అందించారు. దీంతో రైలుని అక్కడికక్కడే నిలిపేశారు. రైలులోని సీ 14 కోచ్ వద్ద మంటలు వ్యాపించాయి. దీంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు.ట్రైన్ చక్రాల దగ్గర నుండి పొగలు కమ్ముకున్నట్లు సంఘటన స్థలం నుండి వచ్చిన దృశ్యాలు చూపించాయి. రైలులో అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు..

ఈ మంటలు బ్యాటరీ బాక్సుకే పరిమితమైనట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక పరీక్ష ముగిసిన వెంటనే రైలు దేశ రాజధానికి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని,వారికి ఎటువంటి గాయాలు సంభవించలేదని సమాచారం.ఈ రైలు ఉదయం 5.40 గంటలకు భోపాల్ నుండి బయలుదేరి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు మధ్యాహ్నం 1.10 గంటలకు ఢిల్లీకి చేరుకోనుంది..

ప్రధాని మోదీ సర్కార్ ఆర్భాటంగా ప్రారంభించిన వందే భారత్‌ రైలు తరచూ ప్రమాదాలకు గురవుతుంది. అక్కడ ఆవును ఢీకొన్నది.. ఇక్కడ బర్రెను ఢీకొట్టింది వంటి వార్తలను వింటూనే ఉన్నాం. ప్రమాదాల్లో రైలు ఇంజిన్‌ ముందు భాగం దెబ్బతినడం వంటి ఘటనలు కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం ప్రకారం..గత ఏడాది జూన్ మరియు డిసెంబర్ మధ్య, వందేభారత్ రైళ్లలో జంతువులు ఢీకొన్న 68 కేసులు నమోదయ్యాయి.వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

Exit mobile version