ఇకపై విమానాల్లో ప్రయాణించాలనుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్తగా కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. అనవసర ఖర్చులను తగ్గించేందుకు ఈ నియమాలను రూపొందించింది.
ప్రభుత్వ ఉద్యోగులు విమానాల్లో ట్రావెల్ క్లాసులో అతితక్కువ ధర ఉన్న టికెట్ క్లాస్ నే ఎంచుకోవాలని.. పర్యటనలు, ఎల్టీసీ కోసం వెళ్లే వారు మూడు వారాల కన్నా ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఉద్యోగులు తమ ప్రయాణానికి ఒక్కో టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలని, ఒక వేళ టూర్ ప్రోగ్రాం ఆప్రూవల్ ప్రాసెస్ లో ఉన్నప్పటికీ బుకింగ్ చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆధీకృత ట్రావెల్ ఏజెంట్ల నుండి మాత్రమే విమాన టిక్కెట్లను కొనుగోలు చేయాలని బాల్మెర్ లారీ అండ్ కో, అశోక్ ట్రావెల్స్ అండ్ టూర్స్, ఐఆర్సీటీసీ నుంచి మాత్రమే టికెట్ కొనుగోలు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రయాణానికి సంబంధించి 72 గంటలలోపు బుకింగ్ చేసినా.. 24 గంటల కన్నా తక్కువ వ్యవధిలో రద్దు చేసినా.. ఉద్యోగి స్వయంగా జస్టిఫికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకే పర్యటన కోసం ఉద్యోగులంతా ఒకే ట్రావెల్ ఏజెంట్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి. ఎల్టీసీ ప్రయాణానికి 21 రోజుల ముందు విమాన టికెట్ ను బుక్ చేసుకోవాలి. అనధికారిక ట్రావెల్ ఏజెంట్లు, వెబ్ సైట్ల నుంచి టికెట్ బుకింగ్ చేసే అనివార్య పరిస్థితులు ఏర్పడితే జాయింట్ సెక్రటరీ లేదా అంత కన్నా ఎక్కువ స్థాయి అధికారి మాత్రమే సడలింపులు మంజూరు చేయాల్సి ఉంటుంది.
ప్రయాణం పూర్తయిన 30 రోజుల్లో ట్రావెట్ ఏజెంట్ కు బకాయిలను చెల్లించాని ఆర్థిక విభాగం అన్ని మంత్రిత్వ శాఖలను కోరింది. ఆగస్ట్ 31, 2022 లోగా ట్రావెల్ ఏజెంట్లకు మంత్రిత్వశాఖలు చెల్లించాల్సిన అన్ని బాకాయిలను క్లియర్ చేయాలి. పెట్రోల్, డిజిల్ పై సుంకాల తగ్గింపు, కొన్ని వస్తువులపై కస్టమ్స్ తగ్గింపు, అధిక ఎరువుల సబ్సిడీలు, పేదలకు ఉచిత ఆహార పథకం కింద ఆర్థిక వ్యయాలు ఎక్కు వ అవుతున్నాయి. దీంతో అనవసరమైన ఖర్చులు తగ్గించాలని మంత్రిత్వ శాఖ చూస్తోంది.