Site icon NTV Telugu

Budget 2026: గ్లోబల్‌ అనిశ్చితుల్లో భారత్‌ బడ్జెట్‌పై అంచనాలు.. కీలక రంగాల్లో సంస్కరణలు

Budjet

Budjet

Budget 2026: ఫిబ్రవరి 1వ తేదీన వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టనున్నారు. ఇది భారత ఆర్థిక చరిత్రలో ఒక రికార్డుగా నిలవనుంది. గ్లోబల్‌ జియోపాలిటికల్‌ అస్థిరతల మధ్య దేశ ఆర్థిక వృద్ధిని నిలబెట్టేలా సంస్కరణాత్మక చర్యలు ఈ బడ్జెట్‌లో ఉండనున్నాయని అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆమె ఎనిమిది బడ్జెట్లు ప్రవేశ పెట్టగా, అందులో 2024 ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన ఇంటరిమ్‌ బడ్జెట్‌ కూడా ఉంది. కాగా, 2019లో ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశపు తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ని నియమించారు. 2024లో మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత కూడా ఆమె ఆర్థిక శాఖ బాధ్యతలను కొనసాగించారు. ఈ నేపథ్యంలో, బడ్జెట్‌కు ముందు కీలక ఆర్థిక గణాంకాలపై ఓసారి లుక్కెద్దాం..

Read Also: Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ

జీడీపీ వృద్ధి అంచనాలు
ఆర్థిక సర్వే ప్రకారం, 2026- 27 ఆర్థిక సంవత్సరానికి (FY27) భారతదేశ రియల్‌ జీడీపీ వృద్ధి 6.8 శాతం నుంచి 7.2 శాతం మధ్య ఉండొచ్చని అంచనా. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY26)లో అంచనా వేసిన 7.4 శాతం వృద్ధితో పోలిస్తే స్వల్ప తగ్గుదల అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితుల మధ్య స్థిరమైన వృద్ధిని ప్రతిబింబిస్తోంది.

ఆర్థిక లోటు (Fiscal Deficit):
FY26లో 4.4 శాతం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, FY27లో దీనిని 4.3 శాతానికి తగ్గించాలని భావిస్తోంది. ఇదే సమయంలో లోటు శాతానికి బదులు డెట్‌-టు-జీడీపీ నిష్పత్తిని ప్రధాన ఆర్థిక ప్రమాణంగా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా FY31 నాటికి డెట్‌-టు-జీడీపీ నిష్పత్తిని 50 శాతానికి తీసుకురావడమే లక్ష్యంగా ఉంది.

Read Also: లాంచ్‌కి సిద్ధమైన Tecno Pova Curve 2.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు..

మూలధన వ్యయం (Capex):
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధికి కీలకమైన మూలధన వ్యయం 10 నుంచి 15 శాతం వరకు పెరగవచ్చని అంచనా. దీనివల్ల క్యాపెక్స్‌ మొత్తం రూ.12 నుంచి రూ.12.5 ట్రిలియన్‌ వరకు చేరే అవకాశం ఉంది.

రంగాల వారీ మార్పులు:
రోడ్లు, రైల్వేలకు ప్రాధాన్యం కొనసాగుతూనే, ఈసారి బడ్జెట్‌లో
* గ్రీన్‌ ఎనర్జీ (గ్రీన్‌ హైడ్రజన్‌ మిషన్‌)
* అణుశక్తి (న్యూక్లియర్‌ ఎనర్జీ)
* హైటెక్‌ తయారీ రంగం (ఏఐ, రోబోటిక్స్‌) వంటి రంగాలకు ఎక్కువ కేటాయింపులు ఉండవచ్చని అంచనా.

క్రెడిట్‌ రేటింగ్‌లో మెరుగుదల:
జపాన్‌కు చెందిన రేటింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ (R&I) సంస్థ, భారత దీర్ఘకాలిక సార్వభౌమ రేటింగ్‌ను ‘BBB’ నుంచి ‘BBB+’కు పెంచుతూ, స్టేబుల్ అవుట్‌లుక్‌ను కొనసాగించింది. అలాగే, స్టాండర్డ్‌ అండ్ పూర్‌స్‌ (S&P) గ్లోబల్‌ రేటింగ్స్‌ కూడా భారతదేశాన్ని ‘BBB-’ నుంచి ‘BBB’కు అప్‌గ్రేడ్ చేశాయి. ఇది గత 18 ఏళ్లలో S&P ఇచ్చిన తొలి సార్వభౌమ అప్‌గ్రేడ్ కావడం విశేషం. మే 2024లోనే భారత్‌పై అవుట్‌ లుక్‌ను ‘స్టేబుల్’ నుంచి ‘పాజిటివ్‌’గా మార్చింది.

Read Also: Vijayawada Tragedy: ప్రేమకు అడ్డుగా మారిన వయస్సు.. యువకుడు ఆత్మహత్య..

ఎగుమతుల్లో రికార్డు:
భారత ఎగుమతులు కొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి..
* FY25లో మొత్తం ఎగుమతులు USD 825.3 బిలియన్‌..
* FY26 తొలి అర్ధభాగంలో USD 418.5 బిలియన్‌..
* సేవల రంగం, నాన్‌-పెట్రోలియం, నాన్‌-జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ ఎగుమతులు ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచాయి.

 7 నెలల కనిష్టానికి నిరుద్యోగం:
MoSPI డేటా ప్రకారం, 2025 నవంబర్‌లో 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగ రేటు 4.7 శాతానికి పడిపోయింది. ఇది అక్టోబర్‌ 2025లో నమోదైన 5.2 శాతంతో పోలిస్తే తగ్గుదలగా చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 3.9 శాతం, పట్టణాల్లో 6.5 శాతంగా నమోదవడం, కార్మిక మార్కెట్‌ బలోపేతాన్ని సూచిస్తోంది.

ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత:
ఫిబ్రవరి 2025 నుంచి ఇప్పటి వరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మొత్తం 125 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో రిపో రేటు 5.25 శాతానికి చేరుకుంది. బలమైన ఆర్థిక వృద్ధి కొనసాగుతున్న వేళ ఈ నిర్ణయం అధిక ప్రాధాన్యం సంతరించుకుంది.

యూరప్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం:
యూరప్‌తో కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) భారత తయారీ రంగానికి, ఎగుమతుల స్థిరత్వానికి, వ్యూహాత్మక సామర్థ్యానికి మరింత బలం చేకూర్చనుంది. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతులలో 99 శాతానికి పైగా ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్‌ లభించనుంది. అదే సమయంలో సున్నిత రంగాల పరిరక్షణకు ప్రభుత్వం తగిన విధాన స్వేచ్ఛను నిలుపుకుంది. అయితే, మొత్తంగా చూస్తే, తొమ్మిదో బడ్జెట్‌ ద్వారా నిర్మలా సీతారామన్‌ భారత ఆర్థిక వృద్ధిని మరింత బలోపేతం చేసే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version