Diwali 2022: ఈ ఏడాది దీపావళికి రాబోతున్న సినిమాల్లో విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ కూడా ఒకటి. తమిళ ‘ఓ మై కడవులే’ ఆధారంగా రూపొందిన సినిమా ఇది. తమిళంలో అశోక్ సెల్వన్, రితికాసింగ్, వాణిబోజన్, విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా హిట్ అయింది. దీనిని ఇప్పుడు తెలుగులో విశ్వక్ సేన్ తో ‘ఓరి దేవుడా’గా తీశారు. తమిళంలో విజయ్ సేతుపతి నటించిన దేవుడు పాత్రను తెలుగులో వెంకటేశ్ పోషించారు. అయితే ఎందుకో ఏమో కానీ ఆశించిన స్థాయిలో ఈ సినిమాపై బజ్ ఏర్పడలేదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రామ్ చరణ్ హాజరయ్యారు. ఇదే సినిమా కన్నడలో ‘లక్కీమేన్’గా రూపొందింది. డార్లింగ్ కృష్ణ నటించిన ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ దేవుడి పాత్రలో మెరిశారు. సెప్టెంబర్ లోవిడుదలైన ఈ సినిమా అక్కడ నిరాశపరిచింది. ఇప్పుడు తెలుగు వెర్షన్ ప్రజల తీర్పు కోసం వస్తోంది. దీపావళి కానుకగా రాబోతున్న ఈ సినిమాకు పోటీగా శివ కార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’, కార్తీ నటించిన ‘సర్దార్’, మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ వస్తున్నాయి.
వీటిలో ‘ప్రిన్స్’ కోసం విజయ్ దేవరకొండ, రానా రంగంలోకి దిగారు. నిజానికి మార్కెట్‌లో ఈ సినిమాపై కొద్దిగా బజ్ ఉంది. దీనికి ముందు విడుదలైన శివకార్తికేయన్ సినిమాలు ఫర్వాలేదనిపించటం ఓ కారణం. ఇక కార్తీ నటించిన ‘సర్దార్’ పై కూడా ఏ మాత్రం బజ్ ఏర్పడలేదు. దీని దర్శకుడు పి.యస్. మిత్రన్. ఇతగాడి టేకింగ్ బాగుంటుంది. మరి ఇది అండర్ డాగ్‌గా బరిలో దిగుతుందేమో చూడాల్సి ఉంది. అలాగే మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ కూడా దీపావళి బరిలో దూకుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో మీమ్స్ గురించి విష్ణు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి ఉన్నాడు. అసలు అంచనాలే లేని ఈ సినిమా ఏ మాత్రం బాగున్నా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒక్కటి మాత్రం నిజం. ప్రేక్షకులలో సినిమాల పట్ల ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఎంతో క్రేజ్ ఉంటే తప్ప థియేటర్ల వైపు అడుగులు వేయటం లేదు. విడుదలైన కొద్ది రోజులకే సినిమాలు ఓటీటీలో దర్శనం ఇస్తుండటం ఇందుకు రీజన్. అందుకే ఓటీటీలో వస్తే చూద్దాం లే అనే మైండ్ సెట్‌కు ట్యూన్ అయి ఉన్నారు. ఇది సినిమాల జయాపజయాలపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. ఇదిలా ఉంటే గత వారం విడులైన కన్నడ డబ్బింగ్ సినిమా ‘కాంతారా’కి మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవటంతో చక్కటి వసూళ్ళను సాధిస్తోంది. ఈ సినిమా విజయం కూడా దీపావళికి రాబోయే సినిమాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే దీపావళి సినిమాల రిలీజ్ కి మరో రెండు మూడు రోజులు ఉన్న తరుణంలో విడుదల రోజుకు ఏ సినిమాకు క్రేజ్ పెరుగుతుందన్నది చూడాల్సి ఉంది.