వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..

Fifa World Cup

Fifa World Cup

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 సమీపిస్తుండగా.. ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రోఫీపై పడింది. ఈసారి అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్ వంటి జట్లు టైటిల్ ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయి. అయితే వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకోవడం ఎంత గొప్ప విషయమో తెలిసిందే. కానీ ఈ ట్రోఫీ అసలు విలువ ఎంత ఉంటుందనే ప్రశ్న చాలా మందిలో ఉంది.

నిజయానికి భావోద్వేగ పరంగా చూస్తే.. ఈ ట్రోఫీ విలువను డబ్బుతో కొలవడం అసాధ్యం. అయితే ఇందులో ఉపయోగించిన పదార్థాల ఆధారంగా లెక్కిస్తే ప్రస్తుతం దీని విలువ సుమారు 2.5 లక్షల అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం, ట్రోఫీ తయారీలో అవసరమైన అత్యున్నత స్థాయి నైపుణ్యం కారణంగా దీని విలువ మరింత పెరిగింది. అయితే వాస్తవానికి ఈ ట్రోఫీ విలువ దాని తయారీ ఖర్చుతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ. ఒకవేళ ఈ ట్రోఫీని నేడు వేలానికి ఉంచితే దీని ధర 20 మిలియన్ డాలర్లకు పైగా పలికే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత కరెన్సీలో ఇది రూ.170 కోట్లకుపైగా అవుతుంది.

×
×
Ad

ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ ఎలా తయారవుతుంది?

ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ ఎత్తు 37 cm ఉండగా, బరువు సుమారు 6 కి.గ్రా.లు ఉంటుంది. ఇది 18 క్యారెట్ల బంగారంతో తయారవుతుంది. ట్రోఫీ డిజైన్‌ లో ఇద్దరు వ్యక్తులు భూమిని పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా కనిపిస్తారు. ఫుట్‌బాల్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే క్రీడ అనే సందేశాన్ని ఈ రూపకల్పన ప్రతిబింబిస్తుంది. అయితే చాలామంది అనుకునేలా ఈ ట్రోఫీ పూర్తిగా బంగారంతో తయారై ఉండదు. ట్రోఫీ లోపలి భాగం ఖాళీగా ఉంటుంది. ఒకవేళ పూర్తిగా బంగారంతో తయారు చేస్తే అది చాలా బరువుగా మారి ఆటగాళ్లు ఎత్తడం కష్టమవుతుంది. ట్రోఫీ అడుగు భాగంలో రెండు పొరల మలకైట్ అనే ఆకుపచ్చ రంగు ఖనిజాన్ని ఉపయోగించారు.

బ్రెజిల్‌కు శాశ్వతంగా వెళ్లిన పాత ట్రోఫీ:

ఈ ట్రోఫీని ఇటలీకి చెందిన శిల్పి సిల్వియో గజ్జనిగా రూపొందించారు. 1970లో ఫిఫా నిర్వహించిన అంతర్జాతీయ డిజైన్ పోటీలో ఆయన రూపకల్పన ఎంపికైంది. అంతకుముందు ఉపయోగించిన జూల్స్ రిమెట్ ట్రోఫీని 1970లో బ్రెజిల్ మూడోసారి వరల్డ్ కప్ గెలుచుకోవడంతో శాశ్వతంగా ఆ దేశానికి అప్పగించారు. దీంతో కొత్త ట్రోఫీని రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వరల్డ్ కప్ ట్రోఫీని తొలిసారిగా 1974లో పశ్చిమ జర్మనీ గెలుచుకుంది. ఆ జట్టుకు దిగ్గజ డిఫెండర్ ఫ్రాంజ్ బెకెన్‌బావర్ కెప్టెన్‌గా వ్యవహరించారు.

విజేతలకు అసలు ట్రోఫీ దక్కదు:

ఫిఫా వరల్డ్ కప్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్లో ఇదొకటి. ప్రపంచకప్ గెలిచిన జట్టుకు అసలు ట్రోఫీని శాశ్వతంగా ఇవ్వరు. ఫైనల్ ముగిసిన వెంటనే అసలు ట్రోఫీని ఫిఫా తన ప్రధాన కార్యాలయం ఉన్న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు తిరిగి తీసుకెళ్తుంది. దాని బదులుగా విజేత దేశానికి బంగారు పూత పూసిన కాంస్యంతో తయారు చేసిన ప్రత్యేక రిప్లికా ట్రోఫీని అందజేస్తారు. దీంతో అసలు ట్రోఫీ ఎప్పటికీ ఫిఫా ఆధీనంలోనే ఉంటుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత విలువైన గుర్తింపుగా నిలిచిన ఈ ట్రోఫీపై ప్రతి నాలుగేళ్లకోసారి ప్రపంచ దేశాలు కన్నేస్తుంటాయి.