FIFA Worldcup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 అద్భుతమైన ఆరంభాన్ని కొనసాగిస్తోంది. టోర్నమెంట్ ప్రారంభమైన కేవలం ఆరు రోజులకే ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. జూన్ 16న జరిగిన 4 గ్రూప్ దశ మ్యాచ్‌లకు మొత్తం 2,81,223 మంది అభిమానులు హాజరై ప్రపంచకప్ చరిత్రలో ఒక్క రోజులో అత్యధిక ప్రేక్షకుల హాజరు రికార్డును సృష్టించారు.
ఇంతకుముందు 1994 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా జూన్ 28న నాలుగు మ్యాచ్‌లకు కలిపి 2,77,070 మంది ప్రేక్షకులు హాజరుకాగా.. అది ఇప్పటివరకు అత్యధిక రోజువారీ హాజరు రికార్డుగా నిలిచింది. ఇప్పుడు 2026 ప్రపంచకప్ ఆ రికార్డును అధిగమించి కొత్త మైలురాయిని చేరుకుంది. జూన్ 16న జరిగిన ఫ్రాన్స్-సెనెగల్, ఇరాక్-నార్వే, అర్జెంటీనా-అల్జీరియా, ఆస్ట్రియా-జోర్డాన్ మ్యాచ్‌లకు అభిమానులు భారీగా తరలివచ్చారు. స్టేడియాలన్నీ ప్రేక్షకులతో నిండిపోవడంతో ఫుట్‌బాల్ పండుగను తలపించే వాతావరణం నెలకొంది.
టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 13,09,652 మంది అభిమానులు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రతి మ్యాచ్‌కు సగటున 65,483 మంది ప్రేక్షకులు హాజరవుతుండటం విశేషం. ఈ వేగం కొనసాగితే గ్రూప్ దశ ముగిసేలోపే 1994 ప్రపంచకప్‌లో నమోదైన 35 లక్షల మొత్తం ప్రేక్షకుల రికార్డు కూడా బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ చారిత్రాత్మక ఘట్టంపై ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో హర్షం వ్యక్తం చేశారు. “ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక ప్రేక్షకులు హాజరైన రోజు ఇది. అభిమానులు తీసుకొచ్చిన ఉత్సాహం, రంగుల హంగులు, భావోద్వేగాలు ఈ టోర్నమెంట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి” అని ఆయన అన్నారు. అలాగే, “ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందనే విషయాన్ని ఫిఫా వరల్డ్ కప్ 2026 మరోసారి నిరూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటపై ఉన్న ప్రేమను అభిమానులు తమ హాజరుతో చాటిచెప్పారు” అని అన్నారు.
ప్రపంచకప్ మ్యాచ్‌లకు టికెట్లపై భారీ డిమాండ్ కొనసాగుతోందని ఫిఫా తెలిపింది. అభిమానులు టికెట్ల లభ్యత కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా పరిశీలించాలని సూచించింది. ప్రపంచకప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఫిఫా లాభాపేక్ష లేకుండా ప్రపంచవ్యాప్తంగా పురుషులు, మహిళలు, యువత ఫుట్‌బాల్ అభివృద్ధికి వినియోగిస్తోంది. తమ 211 సభ్య దేశాల ఫుట్‌బాల్ కార్యక్రమాలకు ఈ నిధులను తిరిగి పెట్టుబడిగా మళ్లిస్తున్నట్లు ఫిఫా వెల్లడించింది.

