ఇటీవల పోలీస్ శాఖలో పలువురు అధికారులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తిగత కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ ఆకుల దీపిక ఆత్మహత్యకు పాల్పడింది. నాగోల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆకుల దీపిక(38) హస్తినాపురం టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. భర్త రవికుమార్ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మీర్ పేట్ పోలీసులు. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.