Ankita Bhandari Case: ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అంకితా భండారీ స్నేహితులను పోలీసులు విచారించగా వారు సంచలన విషయాలను బయటపెట్టారు. రిసార్ట్ యజమానితో పాటు కొంతమంది ఉద్యోగులు ఆమెను అతిథులకు ‘ప్రత్యేక సేవలు’ అందించమని కోరేవారని దానికి ఆమె నిరాకరించడం వల్ల వేధింపులకు గురిచేసేవారని వివరించారు. మరోవైపు, అంకిత వాట్సాప్ చాట్ ద్వారా చాలా విషయాలు వెల్లడయ్యాయని పోలీసులు తెలిపారు. అదేవిధంగా రిసార్టుకు చెందిన ఓ ఉద్యోగినితో బాధితురాలు ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డు కూడా నెట్టింట వైరల్‌గా మారింది.
వాట్సాప్ చాటింగ్ హత్యకు గురైన యువతి రిసార్టులోని పరిస్థితులను తన స్నేహితురాలికి వివరించింది. వారు తనను వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తున్నారని పేర్కొంది. రిసార్టుకు వచ్చే గెస్టులకు ప్రత్యేక సేవలు అందించమంటున్నాడని, అలా చేస్తే గెస్టుకు రూ.10 వేల చొప్పున పారితోషికం ఇస్తానంటున్నాడని తెలిపింది. ఈ మెసేజ్‌లను ఆమె స్నేహితురాలు స్క్రీన్ షాట్‌లు తీసి ఆన్‌లైన్‌లో పెట్టింది. ఆ చిత్రాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. హత్యకు గురైన యువతి తన స్నేహితురాలితో చేసిన వాట్సాప్ చాటింగ్ నిందితులు ఆమెను వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తున్నారనే ఆరోపణలను బలపరిచింది. దీనిపై ఫోరెన్సిక్ విచారణ కూడా జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. అంకిత భండారీ ఏడుస్తూ రిసార్టులోని మరో ఉద్యోగికి చేసిన ఫోన్‌కాల్ కూడా వైరల్‌గా మారింది. ఫోన్‌లో ఏడుస్తూనే వేరే ఎవరితోనో తన బ్యాగ్‌ను మీదకు తీసుకురమ్మని అన్నట్లుగా ఆ ఆడియోలో రికార్డయింది. గెస్టుల కోసం బాధితురాలితో వ్యభిచారం చేయించేందుకు రిసార్టు యజమాని ప్రయత్నించినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ఇప్పటికే భాజపా నేత వినోద్ ఆర్య కుమారుడు, రిసార్టు యజమాని పుల్కిత్ ఆర్య, అతడి సిబ్బంది అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ కీలక విషయం వెల్లడించారు. సదరు యువతి రిసార్టుకు వచ్చే అతిథులకు ‘ప్రత్యేక’ సేవలు అందించేందుకు నిరాకరించడం వల్లే వారు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఆ యువతి తన స్నేహితుడితో జరిపిన చాటింగ్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.
Obscene Video: మూడో తరగతి బాలికకు అసభ్యకర వీడియో చూపించిన ప్రిన్సిపాల్.. కేసు నమోదు
రిసార్టు యజమాని రాష్ట్ర బీజేపీ నేత కొడుకు కావడంతో ఈ ఘటన దేశమంతటా సంచలనంగా మారింది. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉత్తరాఖండ్‌లోని బీజేపీ సర్కారు నిందితుడిని అరెస్టు చేయించి, శుక్రవారం రాత్రి రిసార్టును ధ్వంసం చేయించింది. యువతి హత్యపై సీఎం పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని రిసార్టులను విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అక్రమంగా నిర్వహిస్తున్న రిసార్టులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు బీజేపీ కూడా స్పందించింది. పుల్కిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్యను, వీరి తండ్రి వినోద్ ఆర్యను పార్టీ నుంచి శనివారం సస్పెండ్ చేసింది. అంకిత్ ఆర్య ఉత్తరాఖండ్ ఇతర వెనుకబడిన తరగతుల కమిషన్ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నారు.ఆ పదవి నుంచి తక్షణమే తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలిచ్చింది.