Fatima Sana: ఫాతిమా సనా (Fatima Sana) మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డును నమోదు చేసింది. జింబాబ్వేతో కరాచీలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన అర్ధశతకం. ఇప్పటివరకు ఈ రికార్డు సోఫీ డివైన్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, రిచా ఘోష్ పేర్లపై సంయుక్తంగా ఉండేది. వీరంతా 18 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించగా, ఫాతిమా సనా వారి రికార్డును బద్దలు కొట్టింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు 17 ఓవర్లలో 152/4 స్కోరుతో ఉండగా ఫాతిమా సనా క్రీజ్ లోకి వచ్చింది. రావడం మొదలు ఆమె జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడింది. మిచెల్ మవుంగా బౌలింగ్‌లో ఫోర్‌తో ఖాతా తెరిచిన సనా, తర్వాత కుడ్జై చిగోరా ఓవర్‌లో వరుస బౌండరీలు బాదింది. ముఖ్యంగా నోంవెలో సిబాండా వేసిన ఓవర్‌లో ఫాతిమా సనా విధ్వంసం సృష్టించింది. ఆ ఓవర్‌లో 4, 4, 6, 6, 4తో మొత్తం 24 పరుగులు రాబట్టి కేవలం 14 బంతుల్లోనే 48 పరుగులకు చేరుకుంది. చివరి ఓవర్ రెండో బంతికి రెండు పరుగులు తీసి 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది.
అక్కడితో ఆగని సనా చివర్లో మరో రెండు బౌండరీలు బాది కేవలం 19 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. సనా ధాటికి పాకిస్థాన్ 20 ఓవర్లలో 223/4 భారీ స్కోరు నమోదు చేసింది. ఇది మహిళల టీ20ల్లో పాకిస్థాన్‌కు రెండో అత్యధిక స్కోరు. ఇంతకుముందు మహిళల టీ20ల్లో పాకిస్థాన్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు ‘నిదా దారి’ పేరిట ఉండేది. ఆమె 2019లో దక్షిణాఫ్రికాపై 20 బంతుల్లో అర్ధశతకం సాధించింది.
2026 సంవత్సరంలో ఫాతిమా సనా అద్భుత ఫామ్‌లో కొనసాగుతోంది. ఈ ఏడాది మహిళల టీ20ల్లో ఆమె ఇప్పటికే ఐదు ఇన్నింగ్స్‌లలో 229 పరుగులు చేసింది. ఆమె స్ట్రైక్‌రేట్ 206.3గా ఉంది. అంతకుముందు దక్షిణాఫ్రికాపై 41 బంతుల్లో 90 పరుగులు చేసి తన కెరీర్‌లోనే అత్యధిక టీ20 స్కోరును నమోదు చేసింది.
