కూతురు పుడితే మా ఇంట్లో మహాలక్ష్మీ పుట్టిందని మురిసిపోయే తండ్రులు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే తండ్రి మాత్రం కూతురు పాలిట యముడిలా మారాడు. కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కాలయముడయ్యాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారిని కాళ్లు పట్టుకుని నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు. 12 నెలల కూతురుని కడతేర్చాడు తండ్రి. ఈ హృదయ విదారకమైన ఘటన సూర్యపేట జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో రాత్రి వేళ భార్యతో గొడవకు దిగాడు భర్త. ఈ సమయంలో చిన్నారి పాప హడలిపోయి ఏడవడం ప్రారంభించింది.
Also Read:JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. పలువురు ఉగ్రవాదులు హతం!
దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ కసాయి తండ్రి పసిపాప అని చూడకుండా కాళ్లు పట్టుకొని నేలకు కొట్టాడు. దీంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూతురి మృతితో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. కసాయి తండ్రిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
