NTV Telugu Site icon

Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Accident

Accident

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంతో వేకువ ఝామున రహదారి నెత్తురోడింది. ఇవాళ (శుక్రవారం) ఉదయం కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ హస్పటల్ కు తరలించారు. రొయ్యల ఫీడ్‌తో వెళ్తున్న కంటెయినర్‌ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ దారుణం జరిగింది. మృతుల్లో ఐదుగురు కోనసీమ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరో మృతదేహం కంటెయినర్‌ డ్రైవర్‌ది కాగా.. అతని పేరు, ఇతర వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

Read Also: Coolie : రజనీకాంత్ ‘కూలీ’ లో పవర్ ఫుల్ రోల్ చేస్తున్న ఫహాద్‌ ఫాజిల్‌..?

కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. రొయ్యల ఫీడ్‌తో పాండిచ్చేరి నుంచి భీమవరం ఆ కంటెయినర్‌ వెళ్తుండగా.. బొలెరో వ్యాన్‌ తాళ్లరేవు నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడ వైపుకు వెళ్తుంది. అయితే, పుల్లల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను బొలెరో డ్రైవర్‌ అతివేగంగా ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో కంటెయినర్‌కు ఢీ కొట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆ సంఘటన ప్రదేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రమాదం చోటు చేసుకోవడంతో రెండు మూడు కిలో మీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.