NTV Telugu Site icon

IND vs PAK: భారత్‌, పాకిస్థాన్‌ ‘మెగా’ మ్యాచ్‌.. ఆసుపత్రుల్లో బెడ్‌లు బుక్‌ చేసుకున్న ఫాన్స్!

Fans Book Hospital Beds

Fans Book Hospital Beds

Fans Book Hospital Beds for India vs Pakistan Match in Ahmedabad: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా శనివారం (అక్టోబరు 14)న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మెగా మ్యాచ్‌ కోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. మ్యాచ్‌కు ఇంకా ఒక రోజు మాత్రమే ఉండడంతో ఫాన్స్ అందరూ సిద్దమయిపోతున్నారు.

భారత్, పాకిస్తాన్‌ చూసేందుకు ఈరోజు చాలా మంది ఫాన్స్ అహ్మదాబాద్‌ చేరుకొనున్నారు. ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు బయట ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు ఎప్పుడో హోటల్స్ బుక్ చేసుకున్నారు. హోటల్ రూమ్స్ దొరకాని వారు ఆసుపత్రుల్లో బెడ్‌లు బుక్‌ చేసుకుంటున్నారు. హోటల్‌ గదులన్నీ ఇప్పటికే బుక్ అయిపోవడం, ధరలలు 20 రెట్లు పెరగడంతో.. మ్యాచ్‌ చూడాలన్న పట్టుదలతో ఉన్న అభిమానులు స్థానిక ఆసుపత్రుల్లో ఆరోగ్య పరీక్షల ప్యాకేజీలు తీసుకుని బెడ్‌లు బుక్‌ చేసుకుంటున్నారు.

Also Read: AUS vs SA: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా చెత్త రికార్డు!

వైద్య పరీక్షల అనంతరం భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ సమయానికి వెళ్లేలా ఫాన్స్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్యాకేజీ వల్ల అటు వైద్య పరీక్షలు పూర్తవడంతో పాటు మ్యాచ్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. మెగా మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఎంతలా తహతహలాడుతున్నారో చూపేందుకు ఇది ఓ ఉదాహరణ అని చెపుప్పొచు. అయితే రోగులకు తప్ప అభిమానులకు బెడ్‌లు ఇవ్వడానికి కొన్ని ఆసుపత్రులు విముఖత చూపిస్తున్నాయట.