Rohit Sharma on Ravichandran Ashwin Leaving Rajkot Test: రసవత్తర క్రికెట్ మ్యాచ్‌లో కూడా కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనే వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్ణయానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు ఇచ్చాడు. కుటుంబానికే మొదటి ప్రాధాన్యత అని, అలాంటి వార్తలను విన్నప్పుడు రెండో ఆలోచన ఉండదని రోహిత్ పేర్కొన్నాడు. కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ మధ్య నుంచే అశ్విన్ చెన్నైకి వెళ్ళిపోయాడు. తిరిగి ఆదివారం జట్టుతో కలిశాడు.
మూడో టెస్టులో భారత్ విజయం సాదించిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ… ‘టెస్ట్ మ్యాచ్ మధ్యలో అనుభవజ్ఞుడైన బౌలర్‌ను కోల్పోవడం అంత సులభం కాదు. ఏదేమైనా ఒక్కోసారి కుటుంబానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యామిలీ నుంచి ఏదైనా వార్తలను విన్నప్పుడు మా మనస్సులో రెండవ ఆలోచన ఉండదు. ఆర్ అశ్విన్ చేసింది సరైనదే. అతను కుటుంబంతో ఉండాలని కోరుకున్నాడు. వెంటనే జట్టులో భాగం కావడం ఆట పట్ల అశ్విన్‌కు ఉన్న నిబద్ధత ఏంటో అర్ధమవుతుంది. యాష్ తిరిగిరావడం మాకు సంతోషంగా ఉంది’ అని అన్నాడు.
Also Read: MS Dhoni Captain: ఐపీఎల్ ఆల్-టైమ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ.. రోహిత్‌కు దక్కని చోటు!
రాజ్‌కోట్‌లో రెండో రోజు ఆట తర్వాత జట్టుకు దూరమైన రవిచంద్రన్ అశ్విన్.. నాలుగో రోజు మధ్యాహ్నం అందుబాటులోకి వచ్చాడు. రాగానే మైదానంలోకి దిగిన యాష్.. కీలక వికెట్ కూడా పడగొట్టాడు. అశ్విన్ టెస్ట్ క్రికెట్‌లో 500 వికెట్లు పడగొట్టాడు. 500 వికెట్లు తీసిన రెండో భారతీయ బౌలర్‌గా యాష్ రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు. రాజ్‌కోట్ టెస్టులో 434 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే.