Fake Officers: హైదరాబాద్ నగరంలో మోసాల ముఠా రెచ్చిపోయింది. ట్రస్ట్ లను లక్ష్యంగా చేసుకుని CSR ఫండ్స్ ఇప్పిస్తామని నమ్మించి, పెద్ద మొత్తంలో దోచుకున్న ముఠా గుట్టు మలక్‌పేట పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నగరంలోని ఓ ట్రస్ట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా.. నకిలీ డాక్యుమెంట్లు, టాస్క్ ఫోర్స్ యూనిఫార్ములతో సినిమా స్టైల్‌లో మోసానికి పాల్పడింది. ఈ ముఠా సభ్యులు ట్రస్ట్‌ల వద్దకు వెళ్లి.. మా వల్ల మీరు భారీగా CSR ఫండ్స్ పొందవచ్చు అంటూ నమ్మకం కల్పించారు. అయితే, అందులో 50 శాతం తమకు ఇవ్వాలని అగ్రిమెంట్ చేయించి, ముందుగా ఒక కోటి రూపాయలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరారు. ట్రస్ట్ లోని ఒక సభ్యుడు కోటి రూపాయలు సమకూర్చగా, ఆ తర్వాత ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Read Also:HYDRAA: హైడ్రా ఫాతిమా కాలేజీ పట్ల ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తోంది..?
నకిలీ టాస్క్ ఫోర్స్ యూనిఫార్మ్‌లో వచ్చిన కొంతమంది, ట్రస్ట్ సభ్యుడి ఇంటికి వెళ్లి ఒక ఫేక్ బ్యాంక్ ఖాతా వివరాలు చూపించి.. “మీ అకౌంట్ నుంచి 6 కోట్ల రూపాయలు అనధికారికంగా ట్రాన్స్‌ఫర్ అయ్యాయి.. సమాధానం చెప్పాలి” అంటూ బెదిరించారు. అంతేగాక, ఈ విషయం బయటకు రాకుండా చూడాలంటే 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ విషయాన్నీ నమ్మిన ట్రస్ట్ సభ్యుడు 50 లక్షలు ఇచ్చిన తర్వాత మోసపోయానని గ్రహించి.. మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ముఠాను గుర్తించి మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు.
Read Also:YS Jagan Bangarupalyam Visit: నేడు చిత్తూరు పర్యటనకు జగన్.. ఆంక్షలతో ఉత్కంఠ..!
పోలీసులు ముఠా నుండి మొత్తం 6.9 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు టాస్క్ ఫోర్స్ అధికారుల పేరును వాడి, బెదిరింపులు, వసూళ్లు చేసారని స్పష్టం చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో, ప్రజలు, ట్రస్ట్‌లు అలాంటి వంచనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
