Site icon NTV Telugu

Golden Temple: స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుళ్ల కలకలం.. వారం వ్యవధిలోనే మూడోసారి!

Golden Temple

Golden Temple

Golden Temple: సిక్కుల పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో వరుస పేలుడు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున పేలుడు శబ్దం వినిపించిందని పలు వర్గాలు తెలిపాయి. వారం వ్యవధిలో పరిసరాలను కుదిపేసిన మూడో పేలుడు ఇది. వివరాల ప్రకారం దాదాపు అర్ధరాత్రి 12.30 గంటలకు పేలుడు సంభవించింది. క్రూడ్ బాంబు పేలిన తర్వాత ఒక అనుమానితుడిని పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడు జరిగిన సమయంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ సమీపంలోని గదిలో ఉన్నారని కూడా వర్గాలు తెలిపాయి. ముగ్గురినీ విచారించారు.

ఈ పేలుడుకు ఇప్పటివరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. ఈ ఘటనపై పంజాబ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గురువారం నాటి పేలుడుకు కారణమైన క్రాకర్‌లో పొటాషియం క్లోరేట్‌ను ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితులను పట్టుకుంటున్నట్లు పంజాబ్ పోలీసులు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. “అర్ధరాత్రి 12.15 – 12.30 గంటల సమయంలో పెద్ద శబ్ధం వినిపించింది. మరో పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నాం. ఇంకా నిర్ధారించబడలేదు. భవనం వెనుక కొన్ని ముక్కలు కనుగొనబడ్డాయి. కానీ చీకటిగా ఉన్నందున అవి ఏంటో కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నాము.” అని పోలీసు కమిషనర్ నౌనిహాల్ సింగ్ విలేకరులతో అన్నారు. కాగా, పంజాబ్ పోలీసులు కూడా ఈ ఘటనపై ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా ముందు ప్రస్తావిస్తామని చెప్పారు.

Mahmood Ali : దేశంలోనే అత్యున్నత పోలీస్ శాఖగా తెలంగాణ పోలీస్

అంతకుముందు, మే 6, మే 8 తేదీలలో వరుసగా గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో రెండు పేలుళ్లు సంభవించాయి. తద్వారా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పంజాబ్ పోలీసులు రెండు పేలుళ్లపై దర్యాప్తు చేయడానికి అన్ని ఏజెన్సీల సహాయం తీసుకుంటున్నారు. రెండో పేలుడు జరిగిన ప్రదేశాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం కూడా సందర్శించి పరిశీలించింది. మొదటి పేలుడులో, ఒక వ్యక్తి గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని కొన్ని భవనాల అద్దాలు దెబ్బతిన్నాయి. మే 8 ఉదయం అదే వీధిలో తక్కువ-తీవ్రత కలిగిన రెండో పేలుడులో మరొక వ్యక్తి గాయపడ్డాడు.

Exit mobile version