Site icon NTV Telugu

Minister Seethakka: ప్ర‌తి మ‌హిళా ఎస్‌హెచ్‌జీలో ఉండాలి.. క‌లెక్ట‌ర్లకు మంత్రి సీతక్క ఆదేశాలు!

Minister Seethakka

Minister Seethakka

అంగన్వాడీలు ఈనెల 11న తెరుచుకోనున్నాయని, అంగ‌న్వాడీల్లో చిన్నారులు చేరేలా చ‌ర్య‌లు చేప‌ట్టండని క‌లెక్ట‌ర్లకు మంత్రి సీత‌క్క‌ ఆదేశాలు జారీ చేశారు. శిధిలావ‌స్త‌లో ఉన్న అంగ‌న్వాడీ కేంద్రాల‌ను సమీపంలోని ఖాళీ ప్ర‌భుత్వ భ‌వ‌నాల్లోకి మార్చండని సూచించారు. కొత్త‌గా వెయ్యి అంగ‌న్వాడీ భ‌వ‌నాలు నిర్మించ‌బోతున్నామని, వాటికి కావాల్సిన స్థ‌లాల‌ను సేక‌రించండని చెప్పారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థులకు యునిఫామ్‌ల‌ను మహిళా సంఘాల‌చే కుట్టిస్తున్నామని, పాఠ‌శాల తెరిచే రోజు విద్యార్థులందరికి యునిఫామ్‌లు పంపిణీ చేస్తామని మంత్రి సీత‌క్క‌ తెలిపారు. సచివాలయంలో మంత్రి సీతక్క, సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మహిళా సంఘాలచే సోలార్ ప్లాంట్స్-పెట్రోల్ బంక్స్ ఏర్పాటు, నూతన మహిళ సభ్యుల గుర్తింపు, కిశోర బాలికలు-దివ్యాంగులు-వయోధిక మహిళా సంఘాల ఏర్పాటు, ఇందిరమ్మ మహిళా శక్తి భవనాల నిర్మాణ పనుల పురోగతి, మహిళా సంఘాలచే ప్రభుత్వ పాఠశాలల స్కూల్ యునిఫామ్‌ల సరఫరా తదితర అంశాలపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… ‘కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటిశ్వ‌రుల‌ను చేసే ల‌క్షంతో క‌లెక్ట‌ర్లు ప‌నిచేయాలి. తెలంగాణ రైజింగ్ 2047 సాకారం కావాలంటే మ‌హిళా సంఘాల‌ను బ‌లోపేతం చేయాలి. మ‌హిళా సంఘాల‌చే సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించేలా క‌లెక్ట‌ర్లు కృషి చేయాలి. అక్టోబ‌ర్ 2న సోల‌ర్ ప్లాంట్లు ప్రారంభించే ల‌క్ష్యంతో క‌లెక్ట‌ర్లు ప్ర‌త్యేక దృష్టి సారించాలి. ఇప్ప‌టికే జిల్లాల వారిగా సోలార్ ఇన‌స్టాలేష‌న్ కంపెనీల‌తో ఒప్పందాలు జ‌రిగాయి. వారితో స‌మన్వ‌యం చేసుకుని సోలార్ ప్లాంట్ల ప‌నులు ప్రారంభించాలి’ అని అన్నారు.

’22 జిల్లాల్లో ఇందిరా మ‌హిళా శ‌క్తి భ‌వ‌నాల నిర్మాణ ప‌నుల‌ను న‌వంబ‌ర్ లోపు పూర్తి చేయాలి. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, అంగ‌న్వాడీ కేంద్రాలకు పేద పిల్ల‌లు వ‌స్తారు. అంగ‌న్వాడీలు, ప్ర‌భుత్వ బ‌డులు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. వాటి ప్ర‌భావం తెలంగాణ భ‌విష్య‌త్తు మీద ఉంటుంది. కాబ‌ట్టి వాటిపై స్పెషల్ ఫోక‌స్ పెట్టండి. ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్దుల‌కు యునిఫామ్‌ల‌ను మహిళా సంఘాల‌చే కుట్టిస్తున్నాము. ఈ విద్యా సంవ్స‌రానికి సంబంధించి 90 శాతం యునిఫామ్‌ కుట్టు ప‌నులు పూర్త‌య్యాయి. పాఠ‌శాల తెరిచే రోజు విద్యార్దులంద‌రికి యునిఫామ్‌ల‌ను పంపిణి చేస్తాం. గ‌తంలో స్కూల్లు స్టార్ట్ అయిన ఆరు నెల‌ల త‌ర్వాత యునిఫామ్‌లు అందేవి. అంగ‌న్వాడీలు ఈనెల 11న తెరుచుకోనున్నాయి. అంగ‌న్వాడీల్లో చిన్నారులు చేరేలా చ‌ర్య‌లు చేప‌ట్టండి. ప్రైవేటు, ప్లే స్కూల్ల‌కు దీటుగా అంగ‌న్వాడీల‌ను తీర్చిదిద్దండి. శిధిలావ‌స్త‌లో ఉన్న అంగ‌న్వాడీ కేంద్రాల‌ను సమీపంలోని ఖాళీ ప్ర‌భుత్వ భ‌వ‌నాల్లోకి మార్చండి. కొత్త‌గా వేయి అంగ‌న్వాడీ భ‌వ‌నాలు నిర్మించ‌బోతున్నాం, వాటికి కావాల్సిన స్థ‌లాల‌ను సేక‌రించండి’ అని మంత్రి కలెక్టర్లకు సూచించారు.

‘అత్యంత పేద‌రికంలో ఉన్న‌వాళ్లు, మారుమూల ప్రాంత మ‌హిళ‌లు, ఎస్టీ మ‌హిళ‌లు ఇంకా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ల్లో త‌క్కువ‌గా ఉన్నారు. ప్రైవేటు వ‌డ్డీ వ్యాపారుల చేతిలో పేద‌ల మ‌హిళ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. అందుకే అర్హులైన ప్ర‌తి మ‌హిళా ఎస్‌హెచ్‌జీలో ఉండేలా క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాలి. దివ్యాంగుల దృవీక‌ర‌ణ ప‌త్రాల కోసం 38 ఆసుప‌త్రుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నాం. స‌కాలంలో దివ్యాంగుల‌కు దృవీక‌ర‌ణ ప‌త్రాలు అందేలా క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాలి’ అని మంత్రి సీతక్క కలెక్టర్లను ఆదేశించారు.

 

Exit mobile version