కాంగ్రెస్ నీచ సంస్కృతికి తెరలేపిందని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుత ముఖ్యమంత్రి.. కేసీఆర్ కంటే సంకుచితంగా ఉన్నారు. కాంగ్రెస్ హామీలు ప్రజలను వంచించేలా ఉన్నాయి. కాళేశ్వరం మీద కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప చిత్తశుద్ధిలేదు. కాంగ్రెస్‌కి నిజాయితీ ఉంటే నేషనల్ డాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలి.’’ అని డిమాండ్ చేశారు.
మల్కాజ్‌గిరి నుంచి..
‘‘ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఖర్మ బీజేపీకి పట్టలేదు. సొంతంగానే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాం.. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తాం. అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తా.’’ అని ఈటల ప్రకటించారు.
కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు..
‘‘కాంగ్రెస్ హామీల పట్ల ఇప్పుడిప్పుడే భ్రమలు తొలిగిపోతున్నాయి. బస్సులో ప్రయాణికులు పెరిగినా బస్సుల సంఖ్య పెంచడం లేదు. పొమ్మనలేక పొగపెడుతున్నారు. 66 హామీలు ఇచ్చారు. వారైనా చదువుకున్నారా లేదా?, ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకున్నారా?, పరిపాలన అనుభవం ఉన్నవారు తయారు చేశారా? లేదా?, వచ్చేది ఉందా ? సచ్చేది ఉందా అని హామీలు ఇచ్చారా ?
ప్రజలని వంచించే హామీలు ఇచ్చారు. పాలసీల పేరుతో ప్రజలను పక్కదోవపట్టిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఓటు వేస్తారో లేదో అని భయంతో దరఖాస్తులు తీసుకున్నారు.. ఆశల పల్లకిలో పెట్టారు తప్ప చిత్తశుద్ది లేదు. ఇవి అమలు అయ్యేలా లేవు.’’ అని ఈటల చెప్పుకొచ్చారు.
