England Cricket Board: క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్‌కు గడ్డుకాలం.. రూ. 627 కోట్ల భారీ నష్టంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!

England Cricket Board

England Cricket Board

England Cricket Board: క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండే నేడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) భారీ ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకోబోతోంది. టీమిండియా పర్యటన లేకపోవడం, మరోవైపు ఐసీసీ (ICC) నుంచి రావాల్సిన రెవెన్యూలో కోత పడనుండటంతో ఇంగ్లాండ్ బోర్డుకు దాదాపు 50 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 627 కోట్లు) వరకు నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ది గార్డియన్ (The Guardian) కథనం ప్రకారం.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఆర్థిక పరిస్థితి ఇలా దారుణంగా తయారుకావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇంగ్లాండ్‌లో పర్యటించే జట్లను బట్టి అక్కడ బ్రాడ్‌కాస్టింగ్ ఆదాయం (Broadcasting income) ఆధారపడి ఉంటుంది. అయితే 2027లో భారత జట్టు (Team India) అక్కడ పర్యటించట్లేదు. దీంతో అటు టీవీ వీక్షకాదరణ, ఇటు కమర్షియల్ ఆదాయంపరంగా బోర్డుకు పెద్ద దెబ్బే పడనుంది.

ఇక రెండో కారణం ఐసీసీ (ICC) తీసుకున్న నిర్ణయం. 2027లో మెంబర్ కంట్రీస్‌కు పంచాల్సిన బ్రాడ్‌కాస్ట్ రెవెన్యూ (Broadcast revenue) నుంచి కొంత మొత్తాన్ని హోల్డ్‌లో పెట్టాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఒక్క ఇంగ్లాండే కాకుండా 12 ఫుల్ మెంబర్ కంట్రీస్ (Full-member nations) పై ప్రభావం పడనుంది. అయితే ఈ నష్టాన్ని కాస్త తగ్గించుకునేందుకు ఈసీబీ ప్రయత్నాలు చేస్తోంది. ఐసీసీతో చర్చలు జరిపి ఈ కోత ప్రభావాన్ని తగ్గించాలని కోరుతోంది. నష్టాన్ని 35 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 439 కోట్లు) పరిమితం చేయాలని చూస్తోంది. ఐసీసీ ఎంత మొత్తం హోల్డ్‌లోడుతుందనేది ఇంకా స్పష్టత రాకపోవడం, పైగా 2027 ఆర్థిక సంవత్సరం ముగియడానికి జనవరి 31, 2028 వరకు సమయం ఉండటంతో స్పాన్సర్‌షిప్‌లు (Sponsorships), ఇతర ఈవెంట్ల ద్వారా ఆదాయాన్ని కాస్త పెంచుకోవచ్చని ఆశిస్తోంది.

అసలు ఐసీసీ ఈ ఆదాయాన్ని ఎందుకు నిలిపివేస్తుందంటే..?
2028 నుంచి ప్రారంభమయ్యే కొత్త రైట్స్ సైకిల్‌లో బ్రాడ్‌కాస్టింగ్ డీల్ (Broadcasting deal) విలువ తగ్గే అవకాశం ఉందని ఐసీసీ అంచనా వేస్తోంది. ఆ సమయంలో క్రికెట్ బోర్డులపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా ఉండటానికి, ముందు జాగ్రత్తగా 2027 పంపకాల నుంచే కొంత సొమ్మును దాచిపెడుతోంది. వాస్తవానికి 2027 అనేది ప్రస్తుత సైకిల్‌లో ఆఖరి సంవత్సరం. పైగా ఆ ఏడాది వన్డే వరల్డ్ కప్ (50-over World Cup) ఉండటంతో మెంబర్ కంట్రీస్‌కు ఐసీసీ నుంచి పెద్ద మొత్తంలోనే పేఅవుట్ (Payout) రావాల్సి ఉంది. కానీ ఐసీసీ ముందుచూపు నిర్ణయం ఇప్పుడు బోర్డుల ప్లానింగ్‌ను దెబ్బతీసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇంతలా భయపడటానికి భారత మార్కెట్ (Indian market) పై ఉన్న అపరిమితమైన ఆధారపడటమే కారణం. అక్కడ టీవీ రైట్స్, వ్యూయర్‌షిప్ రెవెన్యూ విలువ పెరగాలంటే టీమిండియా మ్యాచ్‌లు చాలా కీలకం. ప్రస్తుతం సొనీ పిక్చర్స్‌తో (Sony Pictures) ఈసీబీకి 185 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 2,323 కోట్లు) ఆరేళ్ల కాంట్రాక్ట్ ఉంది. ఇది 2028తో ముగియనుండగా, ఆ తర్వాత వచ్చే కొత్త డీల్ విలువ బాగా తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రభావం కేవలం ఈసీబీ బోర్డుతోనే ఆగిపోదు. ఇంగ్లాండ్ కౌంటీ సిస్టమ్ (County system) పై కూడా తీవ్ర పడేలా ఉంది. ఈసీబీకి ఆదాయం తగ్గితే, అది కౌంటీలకు ఇచ్చే ఫండ్స్ (Financial support) తగ్గిస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్న 18 కౌంటీ జట్లలో 10 జట్లు ఆర్థిక నష్టాల్లో (Financial losses) నడుస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా ఈసీబీ ఇచ్చే ఫండింగ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. 2025లో ఈసీబీ 12.6 మిలియన్ పౌండ్ల ప్రాఫిట్ (Profit) సాధించినప్పటికీ, 2027లో పరిస్థితులు దారుణంగా ఉంటాయని బోర్డు ముందే ఊహించింది. కానీ తాజా అంచనాల ప్రకారం ఆ నష్టం అనుకున్నదానికంటే చాలా పెద్దదిగా ఉండేలా కనిపిస్తోంది.