ENG-W vs IND-W: భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయానికి అడుగు దూరంలో నిలిచింది. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. నాలుగో రోజు ఆటకు ముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 327 పరుగులు అవసరం కాగా.. చేతిలో కేవలం 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో భారత్‌కు చారిత్రాత్మక టెస్టు విజయం అందుకునేందుకు మరో నాలుగు వికెట్లు చాలు.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 285 పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌ను 170 పరుగులకే ఆలౌట్ చేసి 115 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 86.3 ఓవర్లలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లండ్ లక్ష్యం 457 పరుగులుకు చేరింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో యస్తికా భాటియా 113 పరుగులతో అద్భుత శతకం సాధించింది. ఇది ఆమె తొలి అంతర్జాతీయ సెంచరీ. అంతేకాదు.. లార్డ్స్ మైదానంలో టెస్టు సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా యస్తికా చరిత్ర సృష్టించింది. స్మృతి మంధాన 70 పరుగులు, రిచా ఘోష్ అజేయంగా 50 పరుగులు చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించారు.
457 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు ఆరంభం నుంచే ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన క్రాంతి గౌడ్ మరోసారి తన సత్తా చాటింది. చివరి టెస్టు ఆడుతున్న టామీ బీమాంట్‌ను డకౌట్‌గా పెవిలియన్ పంపింది. ఆపై హీథర్ నైట్ వికెట్ కూడా క్రాంతి ఖాతాలో చేరింది. మరోవైపు సాయలి సాత్ఘరే అద్భుత బౌలింగ్‌తో మాయా బౌచియర్, అలీస్ క్యాప్సీలను అవుట్ చేసింది. స్పిన్నర్ స్నేహ్ రాణా కీలక సమయంలో నాట్ స్కివర్-బ్రంట్, మాడీ విలియర్స్ వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టింది.
ఇంగ్లండ్ తరఫున వికెట్ కీపర్ బ్యాటర్ ఏమీ జోన్స్ మాత్రమే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. ఆమె 72 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచింది. మాడీ విలియర్స్ (26)తో కలిసి ఆరో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. అయితే స్నేహ్ రాణా బౌలింగ్‌లో రిచా ఘోష్ అద్భుత క్యాచ్ పట్టడంతో ఆ భాగస్వామ్యం ముగిసింది.
మూడు రోజుల ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 130/6 స్కోరుతో నిలిచింది. విజయానికి ఇంకా 327 పరుగులు అవసరం కాగా.. భారత్‌కు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కావాలి. నాలుగో రోజు భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే, లార్డ్స్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక టెస్టు విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.

