NTV Telugu Site icon

Tragedy: అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదం.. కొడుకు చనిపోయినా..

Tragedy

Tragedy

Tragedy: కొడుకు చనిపోయిన విషయం తెలియక మూడు రోజుల పాటు అంధకారంలోనే ఉండిపోయారు అంధ తల్లిదండ్రులు. మనసును కలచివేసే ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌లో చోటుచేసుకుంది. కొడుకు మృతి నాగోల్‌లో అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కుమారుడు మృతి చెందిన విషయం తెలియని పరిస్థితిలో మూడు రోజుల పాటు తిండి, తిప్పలు లేక ఆ అంధ వృద్ధ దంపతులు అవస్థలు పడ్డారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు మృతి చెందాడు అనే విషయం తెలియని పరిస్థితుల్లో అంధ తల్లిదండ్రులు ఉండగా.. నాగోల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి అండగా నిలిచారు. వారికి స్నానం చేయించి అన్నం పెట్టించారు నాగోల్‌ సీఐ సూర్య నాయక్. పోస్టుమార్టం కోసం మృతదేహం తరలించారు.

Read Also: Train Accident: ప్యాసింజర్ రైలులో పేలుడు.. కోచ్‌లో దట్టమైన పొగలు..

నాగోల్ డివిజన్ పరిధిలోని జైపురి కాలనీ బ్లైండ్స్ కాలనీలో నివాసం ఉండే రమణ(65), శాంతకుమారి(60) వృద్ధ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రదీప్ తన కుటుంబ సభ్యులతో మరొక చోట ఉంటుండగా.. చిన్న కుమారుడు ప్రమోద్(30) తల్లిదండ్రులతోనే నివాసం ఉంటున్నాడు. ప్రమోద్‌కు పెళ్లి అయినా పలు కారణాలతో భార్య వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆ కారణంతో మద్యానికి బానిసయ్యాడు. అటు మద్యానికి బానిసైనప్పటికీ తల్లిదండ్రులకు అండగా ఉంటూ వారిని చూసుకునేవాడు. మద్యం ఎక్కువగా సేవిస్తుండటంతో ఆరోగ్య పూర్తిగా క్షీణించింది. మద్యం మత్తులోనే 3 రోజుల క్రితం ప్రమోద్ చనిపోయాడు. తమ కుమారుడు చనిపోయినట్లుగా ఇంట్లో అంధులైన తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. వృద్దాప్య దశలో ఏమీ చేయలేని స్థితిలో ఆ వృద్ధ దంపతులు ఉండిపోయారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఈ క్రమంలో ఎవరూ అటువైపు చూడకపోవటంతో మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఒకవైపు ఆకలితో, మరోవైపు భరించలేని కంపు వాసనతో దీనావస్థ స్థితిలో ఉన్న వృద్ధ దంపతులను బయటికి తీసుకొచ్చారు. ఆ వృద్ధ దంపతులకు స్నానం చేయించి.. భోజనం ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం వృద్ధులతో మాట్లాడుతూ.. వారి కుటుంబ వివరాలను తెలుసుకొని.. తమ చిన్నకొడుకు ప్రమోద్‌ చనిపోయాడని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెద్ద కొడుకును పిలిపించి వృద్ధ దంపతులను అప్పజెప్పారు.

 

Show comments