Eluru Tragedy: ఏలూరు జిల్లాలో విషాదం.. జీడి మామిడి తోటలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి!

  • ఏలూరు జిల్లాలో విషాదం
  • తల్లి, కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి
  • కొంత కుళ్లిన స్థితిలో మృతదేహాలు
Dead

Dead

ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం నల్లమడు సమీపంలోని జీడి మామిడి తోటల్లో తల్లి, కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. మృతులను అనంతపల్లి కొత్తపేటకు చెందిన వడ్డే వెంకటలక్ష్మి, ఆమె కుమార్తె వరలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపడంతో పాటు పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వరలక్ష్మి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె దివ్యాంగురాలు కావడంతో.. తల్లి వెంకటలక్ష్మి సహాయంతో రోజువారీ విధులు నిర్వహించేవారు. తల్లి, కూతురు ఇద్దరూ శుక్రవారం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్వగ్రామానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అప్పటి నుంచి వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో నల్లమడు సమీపంలోని జీడి మామిడి తోటలో ఇద్దరి మృతదేహాలు గుర్తించబడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలు కొంత కుళ్లిన స్థితిలో ఉండటంతో వారు మరణించి కొన్ని రోజులు గడిచినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

×
×
Ad

ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. తల్లి, కూతురిని ఎక్కడైనా హత్య చేసి అనంతరం తోటలో పడేశారా? లేదా అదే ప్రాంతంలో హత్య జరిగిందా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. నివేదిక వచ్చిన తర్వాతే మరణాలకు గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.