Chinanindrakolanu Sarpanch Election 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో.. అధికార, ప్రతిపక్షాలకు అత్యంత కీలకంగా మారాయి. అయితే ఏలూరు జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొడుకు ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా.. తండ్రి మాత్రం గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తండ్రి లక్ష్మీనారాయణ రాజు సర్పంచ్ బరిలో నిలిచారు.
నిడమర్రు మండలంలోని చిననిండ్రుకొలను గ్రామ సర్పంచ్ పదవికి లక్ష్మీనారాయణ రాజు పోటీ చేస్తున్నారు. తన సొంత గ్రామంలో తండ్రిని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే ధర్మరాజు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికపై అందరి దృష్టి పడింది. లక్ష్మీనారాయణ రాజికి ప్రత్యర్థిగా టీడీపీ బలపరిచిన పొత్తూరి నరసింహరాజు బరిలో ఉన్నారు. ఆయనకు వైసీపీ మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
అభ్యర్థులు లక్ష్మీనారాయణ రాజు, పొత్తూరి నరసింహరాజు తమ తమ మద్దతుదారులతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కూడా తన తండ్రి తరఫున ప్రచారం మొదలెట్టారు. దాంతో చిననిండ్రుకొలను గ్రామంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గ్రామంలో ఈ సర్పంచ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. కొడుకు ఎమ్మెల్యేగా ఉండగా.. తండ్రి సర్పంచ్‌గా పోటీ చేస్తున్న ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారన్నది స్థానికంగా ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ ఎన్నికలు రెండో దశలో (నవంబర్ 29)న జరుగుతాయి.

