NTV Telugu Site icon

Twitter CEO: ట్విటర్‌కు ఎలాన్‌ మస్క్‌ గుడ్‌బై.. కొత్త సీఈవో ఎవరో తెలుసా?

Twitter

Twitter

Twitter CEO: టెస్లా అధినేత, ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారు. ట్విటర్‌కు కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ను ఎంపిక చేసినట్లు మస్క్‌ ప్రకటించారు. ఆరు వారాల్లో నూతన సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేశారు. ఇదంతా చెప్పిన మస్క్.. కొత్త సీఈవో ఎవరో మాత్రం చెప్పలేదు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అధినేతగా తీరిక లేని షెడ్యూల్‌ను గడుపుతోన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్విటర్‌లో తాను కార్యనిర్వహక అధ్యక్షుడిగా కొనసాగుతానని ఎలాన్‌ మస్క్ స్పష్టం చేశారు. సోషల్ నెట్‌వర్క్‌కు కొత్త నాయకుడిని కనుగొన్నానని, చీఫ్ టెక్నాలజిస్ట్‌గా కొత్త పాత్రలోకి మారనున్నానని యజమాని ఎలాన్‌ మస్క్ ప్రకటించారు. మరో ఆరు వారాల్లోగా కొత్త చీఫ్ వస్తారని తెలిపారు. ట్విట్టర్‌కు కొత్త సీఈఓగా ఓ మహిళను నియమించనున్నట్లు చెప్పారు ఎలాన్ మస్క్. దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆమె ఎవరనేది తెలియజేయలేదు. ఎన్‌బీసీ యూనివర్సల్ ఎగ్జిక్యూటివ్ లిండా యాకారినో ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉండటానికి చర్చలు జరుపుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

ఉత్పత్తి, సాఫ్ట్‌వేర్‌, సిసోప్స్‌లను పర్యవేక్షిస్తానని ఎలాన్‌ మస్క్ తెలిపారు. గతేడాది నవంబర్‌లోనే ట్విటర్‌లో తన సమయాన్ని కుదించుకుంటానని మస్క్‌ వెల్లడించారు. మస్క్‌ తాజా నిర్ణయంతో టెస్లా పెట్టుబడిదారుల ఆందోళన తగ్గింది. ఆ సమయాన్ని మస్క్‌.. టెస్లా కోసం కేటాయిస్తారని వారు ఆశిస్తున్నట్లు సమాచారం. ట్విటర్‌కు కొత్త సీఈఓ నిర్ణయం మస్క్‌ ప్రకటించగానే.. టెస్లా షేర్లు 2.4 శాతం పెరిగడం గమనార్హం.మరోవైపు.. నూతన సీఈవో విషయాన్ని ప్రకటించకముందే మరో కొత్త అప్​డేట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు మస్క్​. ట్విటర్​ కొత్తగా తీసుకువస్తున్న ఎన్​క్రిప్టిడ్​ మెసేజింగ్​ సర్వీస్​ను వెరిఫైడ్ యూజర్లకు ముందుగానే అందుబాటులోకి వస్తున్నట్లు చెప్పారు.

Read Also: Agniveers: అగ్నివీరులకు రైల్వే ఉద్యోగాల్లో 15 శాతం రిజర్వేషన్లు.. వయోపరిమితిలోనూ ఉపశమనం

ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లను ధారపోసి ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 26వ తేదీన ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో గల ట్విట్టర్ ఆఫీస్‌లో ఎలాన్ మస్క్ అడుగు పెట్టిన వెంటనే సీఈఓగా పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. అప్పటివరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పని చేసిన పరాగ్ అగర్వాల్, లీగల్ సెల్ చీఫ్ విజయ గద్దెపై వేటు వేశారు. కొన్ని రోజుల పాటు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగింది. ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లే సమయానికి ట్విట్టర్‌ లో 7,500 మంది ఉద్యోగులు పని చేస్తోండగా, ఆ సంఖ్యను సగానికి తగ్గించారు. డెడ్‌లైన్ పెట్టి మరీ వేలాదిమంది ఉద్యోగులను తొలగించారు.సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త విధానాలను ప్రకటించారు. బ్లూ టిక్ వెరిఫికేషన్ ఉన్న ఖాతాదారుల నుంచి నెలకు ఎనిమిది డాలర్లను వసూలు చేస్తోన్నారు. తొలిదశలో అమెరికా, బ్రిటన్‌లో ఈ పెయిడ్ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను అమలు చేశారాయన. ఆ తరువాత భారత్‌లో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా వేర్వేరు రంగులతో గల బ్యాడ్జీలను అమలు చేశారు. ఇదిలా ఉండగా.. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున డిమాండ్ లభిస్తోన్న నేపథ్యంలో టెస్లా కార్ల తయారీని రెట్టింపు చేస్తామంటూ ఇటీవలే ప్రకటించారు ఎలాన్ మస్క్. భారత్‌లోనూ ప్లాంట్ పెట్టే దిశగా ఆయన చర్యలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే.

Show comments