Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
- ఎలాన్ మస్క్ ప్రకారం..
- రాబోయే 5 ఏళ్లలో ఏఐ మానవ మేధస్సును అధిగమించే అవకాశం..
- మరో 10 ఏళ్లలో హ్యూమనాయిడ్ రోబోలు భారీ సంఖ్యలో అందుబాటులోకి రావచ్చని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమనాయిడ్ రోబోటిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఐదేళ్లలో ఏఐ మానవ మేధస్సును అధిగమించే అవకాశం ఉందని, మరో పదేళ్లలో హ్యూమనాయిడ్ రోబోలు భారీ సంఖ్యలో అందుబాటులోకి రావచ్చని మస్క్ అంచనా వేశారు.
మస్క్ ప్రకారం.. వచ్చే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు ఉండే అవకాశం ఉంది. ఒక్కో రోబో సాధారణ మనిషి కంటే కనీసం ఐదు రెట్లు ఎక్కువ ఉత్పాదకతతో పనిచేయగలిగితే.. ఈ రోబోలు కలిపి చేసే పని ప్రపంచంలోని మొత్తం మానవ శక్తిని మించిపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
- Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
- Gold and Silver Rates Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతంటే..?
- ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
ఉద్యోగాలపై భారీ ప్రభావం..
ఏఐ, రోబోటిక్స్ అభివృద్ధి కారణంగా రొటీన్ పనులపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం కోడింగ్, కస్టమర్ సర్వీస్, డేటా విశ్లేషణ, అకౌంటింగ్, డాక్యుమెంటేషన్, కంటెంట్ తయారీ వంటి అనేక రంగాల్లో ఏఐ ఆధారిత టూల్స్ ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి. భవిష్యత్తులో హ్యూమనాయిడ్ రోబోలు కూడా పరిశ్రమలు, తయారీ రంగం, ప్రమాదకర పనులు, లాజిస్టిక్స్, రోజువారీ సేవల్లోకి భారీగా ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో కొన్ని రకాల ఉద్యోగాల్లో మానవుల అవసరం తగ్గవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొత్త టెక్నాలజీతో పాటు కొత్త రకాల ఉద్యోగాలు కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
రోబోలు.. రోబోలనే తయారు చేస్తే?
హ్యూమనాయిడ్ రోబోల సామర్థ్యం కేవలం మనుషులు నిర్దేశించిన పనులు చేయడానికే పరిమితం కాకపోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రోబోలు ఇతర రోబోలను తయారు చేసే స్థాయికి చేరుకుంటే.. వాటి సంఖ్య చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఒక హ్యూమనాయిడ్ రోబో సామర్థ్యం ప్రధానంగా 3 అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. ఏఐ సాఫ్ట్వేర్ సామర్థ్యం, రోబోలోని ఏఐ చిప్ శక్తి, అలాగే వస్తువులను పట్టుకోవడం, కదిలించడం వంటి మెకానికల్ నైపుణ్యాలు కీలకమని చెప్పారు. ఈ మూడు విభాగాల్లో వేగంగా పురోగతి సాధిస్తుండటంతో రోబోల పనితీరు కూడా భారీగా పెరగవచ్చని మస్క్ అంచనా వేశారు.
టెస్లా ఆప్టిమస్..
టెస్లా ఇప్పటికే ఆప్టిమస్ (Optimus) పేరుతో హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తోంది. ప్రమాదకరమైన, పదేపదే చేయాల్సిన, మనుషులకు విసుగు కలిగించే పనులను రోబోలతో చేయించాలన్నది సంస్థ లక్ష్యం. భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఆప్టిమస్ రోబోలను తయారు చేయాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు చైనా కూడా హ్యూమనాయిడ్ రోబోటిక్స్‌లో వేగంగా ముందుకు వెళ్తోంది. రోబోట్ల తయారీ, పరిశోధన, వాణిజ్య వినియోగంలో చైనా సంస్థలు గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయి. రోబోల సామర్థ్యం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ మరింత తీవ్రం కానుంది.
డబ్బు అవసరం తగ్గుతుందా?
ఏఐ, రోబోలు భారీ స్థాయిలో వస్తువులు, సేవలను తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగలిగితే.. భవిష్యత్తులో సంపద, డబ్బు ప్రాధాన్యత కూడా మారవచ్చని మస్క్ మరో ఆసక్తికరమైన అంచనా వేశారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన వస్తువులు, సేవలు సమృద్ధిగా అందుబాటులోకి వస్తే.. కేవలం జీవనోపాధి కోసం పనిచేయాల్సిన అవసరం తగ్గవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం అనేది తప్పనిసరి అవసరం కాకుండా.. వ్యక్తిగత ఆసక్తి, అభిరుచి లేదా సంతృప్తి కోసం చేసే పనిగా మారే అవకాశం ఉందన్నది మస్క్ అంచనా.
భవిష్యత్తు ఎలా.?
మస్క్ చేసిన అంచనాలు ఖచ్చితంగా జరుగుతాయా అనేది ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. ఏఐ, రోబోటిక్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయి.? ప్రభుత్వాలు ఎలాంటి నియంత్రణలు తీసుకొస్తాయి.? సంస్థలు మనుషులు, రోబోల మధ్య పనిని ఎలా విభజిస్తాయి.? వంటి అనేక అంశాలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
మొత్తంగా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు మన పని విధానాన్ని ఇప్పటికే మార్చడం ప్రారంభించాయి. అందుకే భవిష్యత్తులో ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయా అనే ప్రశ్న కంటే.. ఏఐ, రోబోలతో కలిసి పనిచేసే విధంగా మన నైపుణ్యాలను ఎలా మార్చుకోవాలి? అనేదే కీలకంగా మారుతోంది. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా తమ స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే వారికే రాబోయే కాలంలో ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంది.
Elon Musk says there will be at least a billion humanoid robots within ten years at five times human output, making them "more productive than all humans combined." pic.twitter.com/e5nzBVcJfd
— Catch Up (@CatchUpFeed) September 5, 2026
తాజావార్తలు
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్
-
Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
-
Japan Squad: భారత్‌తో చారిత్రాత్మక టీ20.. జపాన్ జట్టు ప్రకటన.. స్కూల్ క్రికెటర్లకు చోటు!
-
OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!