Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇంకా 2 రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి పార్టీలు. ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి విమర్శలతో అభ్యర్థులు విరుచుకుపడుతున్నారు. రేపు సాయంత్రం వరకు విమర్శలు, ప్రతివిమర్శలు, కౌంటర్లు, పంచ్‌లతో తెలుగు రాష్ట్రాలు మార్మోగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమయం సమీపించడంతో అభ్యర్థులు వేగం పెంచారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వానికి తెరపడనుంది. దీంతో నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
Read Also: KCR: నేటితో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర.. సిద్దిపేటలో బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార వైసీపీ, విపక్ష ఎన్డీయే కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇరు పక్షాలు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారం చేస్తు్న్నాయి. విమర్శలు, ఆరోపణలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో తాము పెట్టిన అంశాలను వివరిస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చామో చెబుతున్నాయి. మరోవైపు ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన బీఆర్‌ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో మరింత బలం పుంజుకోవాలని పట్టుదలగా ఉంది. డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్‌గా పెట్టుకుంది కమలం పార్టీ. అగ్రనేతలంతా అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఇంకా రెండు రోజులే ప్రచారానికి గడువు ఉండడంతో జోరు పెంచారు నేతలు. రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లతో పాటు ఇంటింటి ప్రచారాలు ఊపందుకున్నాయి.