AP Pensions: ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌దారులకు కష్టాలు తప్పడం లేదు.. గత నెలలో గ్రామ/వార్డు సచివాలయ దగ్గర పడిగాపులు పడిన వృద్ధులు.. ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. మే 1వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా పెన్షన్ డబ్బులు జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం.. ఈ రోజు, రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది.. ఇక, ఆన్‌లైన్ లేనివారికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు.. అయితే, తమ బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జమ అవుతుండడంతో.. వాటి కోసం ఇప్పుడు బ్యాంకుల దగ్గర బారులు తీరారు వృద్ధులు, పెన్షన్ దారులు.. ఓవైపు తీవ్రమైన ఎండలు దంచికొడుతున్నా.. బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు.
ఇక, పార్వతీపురం మన్యం గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన వృద్ధులకు పెన్షన్ తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం నుండి అందవలసిన వృద్ధాప్య పెన్షన్ తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవ్వడంతో గిరిశికర ప్రాంతాల నుండి మండల కేంద్రాలకు అష్ట కష్టాలు పడుతూ బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ప్రతి నెల వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ అందించే వారిని.. ఇప్పుడు ఇలా బ్యాంకులకు వెళ్లి పెన్షన్ తీసుకోవడం కష్టంగా ఉందని వృద్దులు వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు అవుతున్న తరుణంలో వేడిని తట్టుకోలేక, బ్యాంకుల ముందు పడిగాపులు కాయలేక లబోదిబోమంటున్నారు. గతంలో ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు కూడా.. ఇప్పుడు.. ఎన్నికల సమయంలో వారికి కొత్త కష్టాలు తప్పడంలేదు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో వృద్ధులకు పెన్షన్ డబ్బు బ్యాంకులో జమ కావడంతో బ్యాంకుల వద్ద పెన్షన్ దారుల హడావిడి కనిపిస్తోంది.. మరోవైపు.. ప్రకాశం జిల్లాలో ఒకటో తేదీనే దాదాపు 70 శాతం మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. సచివాలయం వద్దకు వచ్చి పెన్షన్లు తీసుకోలేని వృద్దులకు ఇళ్ళ వద్దకే తీసుకువెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 69,918 మందికి డీబీటీ ద్వారా పెన్షన్ పంపిణీ చేసే అవకాశం లేకపోవటంతో వారికి స్వయంగా అందజేస్తున్నారు. వారిలో ఇప్పటికే 48,700 మందికి పెన్షన్లు అందజేశారు. మిగతా వారికి రెండవ రోజు పంపిణీ ప్రారంభించారు. ప్రభుత్వం జిల్లాకు 87.49 కోట్లు విడుదల చేసింది. 2,22,607 మందికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా మిగతా వారికి నేరుగా సచివాలయ సిబ్బంది నగదు అందజేస్తున్నారు. అయితే, డీబీటీ ద్వారా పెన్షన్ సొమ్ము బ్యాంకులో పడడంతో.. వృద్ధులు బ్యాంకుల వద్దరకు చేరుకుంటున్నారు.. ఒకేసారి పెద్ద సంఖ్యలో పెన్షన్ దారులు బ్యాంకులకు రావడంతో.. బ్యాంకుల దగ్గర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అయితే, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వృద్ధులు బ్యాంకుల దగ్గర వేచిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల అయితే, బ్యాంకులు తెరుచుకోకముందే.. పెద్ద సంఖ్యలో అక్కడికి పెన్షన్ డబ్బుల కోసం వృద్దులు తరలివెళ్లారు.