NTV Telugu Site icon

Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే ఔదార్యం.. అనాథ పిల్లలను దత్తత తీసుకోనున్న సీఎం

Eknath Shinde

Eknath Shinde

Eknath Shinde: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షల్‌వాడి గ్రామంలో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటంతో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దత్తత తీసుకోనున్నట్లు శివసేన తెలిపింది. “ఇర్షల్‌వాడిలో కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. ఈ పిల్లలను దత్తత తీసుకుని వారికి సంరక్షకులుగా మారాలని సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. 2 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు గల ఈ అనాథ పిల్లలను శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ చూసుకుంటుందని సీఎం ప్రకటించారు” అని శివసేన పేర్కొంది.

“సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు నిర్వహించే శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ ద్వారా విద్య, ఇతర విషయాలకు సంబంధించిన అన్ని ఖర్చులు భరిస్తారని, ప్రతి పిల్లవాడికి వారి చదువుకు నిధులు సమకూర్చడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయబడుతుందని సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఓఎస్డీ మంగేష్ చివ్టే చెప్పారు. కాగా ఇర్షల్‌వాడి కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరుకుంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) శనివారం రాయ్‌గఢ్‌లోని కొండచరియలు విరిగిపడిన ఇర్షల్‌వాడి వద్ద తన శోధన, సహాయక చర్యలను కొనసాగించింది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ఉదయాన్నే ఘటనాస్థలికి చేరుకుంది. ఈ రోజు తర్వాత మరిన్ని బృందాలు సెర్చ్ ఆపరేషన్‌లో చేరే అవకాశం ఉంది.

Also Read: Mohan Bhagwat : శ్రీవాణి ట్రస్ట్‌పై ప్రశంసలు కురిపించిన ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్

బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ముంబైకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని రాయగడ జిల్లా ఖలాపూర్ తహసీల్‌లోని కొండ వాలుపై ఉన్న గిరిజన గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గురువారం ప్రమాద స్థలాన్ని సందర్శించి, సహాయ చర్యలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను కూడా ఆయన ప్రకటించారు. ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ముఖ్యమంత్రి షిండేతో మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడానికి నాలుగు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలను మోహరించినట్లు అమిత్‌ షా చెప్పారు.