Road Accidents: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రోడ్లు రక్తమోడాయి. ఈ ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొట్టి కొద్ది దూరం వెళ్లి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ఎనిమిది మందితో ఆదిలాబాద్ వస్తున్న మ్యాక్స్ పికప్ లాంటి ఇసుజీ వాహనం ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ మొయిజ్ (60) , ఎనిమిదేళ్ల బాబు అలీ, ఖాజా మొయినుద్దీన్ (40), మహమ్మద్ ఉస్మానుద్దీన్ (11) అక్కడికక్కడే మృతి చెందగా.. ఫరీద్(12) అనే బాలుడు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆయేషా ఆఫ్రిన్( 38) ఎఖ్రా (4), సాద్(11) తీవ్రంగా గాయపడగా.. వారు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రులంతా ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన రక్త సంబంధికులే.. గాయపడ్డ వారికి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా.. మృతదేహాలను మార్చురీకి తరలించారు. గాయపడ్డ వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Read Also: Work pressure: పని ఒత్తిడికి మరొకరు బలి.. బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి ఆత్మహత్య
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పీఎస్ పరిధిలోని కోదాడ – హుజూర్‌నగర్ రహదారిపై సాగర్ కాలువ దగ్గర సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ములకపట్నం గ్రామానికి చెందిన వల్లపుదాసు వంశీ ( 22), మాడుగులపల్లి మండలం ఆగా మోత్కూర్‌కి చెందిన అవిరెండ్ల శ్రీకాంత్ (21), మలికంటి దినేష్ (22) సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు నిమిత్తం కోదాడ వచ్చారు. అనంతరం రాత్రి ఒకే బైక్ పై కోదాడ నుంచి హుజూర్ నగర్ వెళుతుండగా గుర్తు తెలియని వాహనం వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న ముగ్గురి తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దినేష్ తండ్రి రెండు వారాల క్రితం వాహన ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోదాడ గ్రామీణ సీఐ రజితా రెడ్డి, చిలుకూరు ఎస్సై రాంబాబు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.