NTV Telugu Site icon

Eden Gardens Fire: ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో అగ్నిప్రమాదం.. కాలిపోయిన ఆటగాళ్ల సామగ్రి!

Eden Gardens Fire

Eden Gardens Fire

Eden Gardens dressing room catches fire during renovation work of World Cup 2023: భారత దేశంలోని ప్రముఖ క్రికెట్‌ స్టేడియంలో ఒకటైన కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొంది. మెగా టోర్నీ ప్రపంచకప్‌ 2023 కోసం మరమ్మత్తు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఈడెన్‌ గార్డెన్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో మంటలు చెలరేగాయి. వీటిని గమనించిన సిబ్బంది వెంటనే ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రెండు ఫైర్‌ ఇంజిన్లు మంటలను పూర్తిగా ఆర్పివేశాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల సమస్య కారణంగా ఈ ఘటన చోటు చేసుకునట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం డ్రెస్సింగ్‌ రూమ్‌లోని ఫాల్‌సీలింగ్‌లో మంటలు వ్యాపించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ జాయింట్‌ సెక్రటరీ దేబ్రత్‌దాస్‌ మైదానానికి వచ్చి పరిశీలించారు. ఈ ప్రమాదంతో ఎక్కువ నష్టం జరగలేదని ఈడెన్‌ గార్డెన్స్‌ సిబ్బంది తెలిపారు. అయితే ఆటగాళ్లకు చెందిన కొంత సామగ్రి కాలిపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌ 2023కి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం నిరాశ కలిగించే అంశం. మంటలు వ్యాపించడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Also Read: Kurnool Road Accident: కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు!

ప్రపంచకప్‌ 2023 కోసం ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో వేగంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 15 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి. ఈ పనులపై ఐసీసీ ప్రతినిధులు ఇప్పటికే సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే నెలలో మరోసారి ఈడెన్‌ మైదానాన్ని ఐసీసీ అధికారులు తనిఖీ చేయనున్నారు. వన్డే ప్రపంచకప్‌ 2023 అక్టోబర్‌ 5న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.