Earthquake in Japan: కొత్త ఏడాది వేళ జపాన్‌ను వరుస భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం నుంచి జపాన్ వాసులు తేరుకోకముందే ఆ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. జపాన్ తీరంలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Lakshadweep: లక్షద్వీప్ మినికాయ్ దీవుల్లో కొత్త విమానాశ్రయం!
అంతకుముందు జనవరి 1న కూడా జపాన్‌లోని అదే ప్రాంతంలో బలమైన భూకంపం సంభవించిందని, ఇది భారీ విధ్వంసానికి కారణమైందని తెలిసిందే. సరిగ్గా వారం క్రితం సంభవించిన భూకంపంలో దాదాపు 200 మంది మరణించగా.. 100 మందికి పైగా గల్లంతయ్యారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తొలి రోజునే సెంట్రల్ జపాన్‌లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనల ధాటికి సెంట్రల్ జపాన్ పరిధిలో చాలా భవనాలు ధ్వంసం అయ్యాయి. ఎంతో మంది శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం.. సుమారు 3500 మంది ఇప్పటికీ జపాన్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు, ఇప్పటికీ వారికి సహాయం అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇంతలో మరోసారి భూమి కంపించడంతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు.