Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్‌..!

Dulquer Salmaan

Dulquer Salmaan

Dulquer Salmaan: మాలీవుడ్ స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడో మన హీరో అయిపోయాడు. మమ్ముట్టి తనయుడిగా సినీ కుటుంబం నుంచి వచ్చినా.. తన టాలెంట్‌తో సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా టాలీవుడ్‌లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు.

‘మహానటి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్.. ఆ తర్వాత ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. లెఫ్టినెంట్ రామ్ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ సినిమాతో దుల్కర్‌కు తెలుగులో భారీ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ‘లక్కీ భాస్కర్’తో మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకుని.. టాలీవుడ్‌లో తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకున్నాడు.

తెలుగు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న తర్వాత దుల్కర్ కొంత గ్యాప్ తీసుకుని తమిళ, మలయాళ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ‘కాంత’, ‘ఐ యామ్ గేమ్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే టాక్ వినిపించింది. దీంతో ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాలపై దుల్కర్ ఫోకస్ పెంచుతున్నాడనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ చేతిలో 2 తెలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఓ తార’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తుండగా.. శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

మరోవైపు ‘శ్రీ శ్రీ’ అనే తెలుగు ప్రాజెక్ట్‌లోనూ దుల్కర్ నటిస్తున్నాడు. దీంతో వరుసగా తెలుగు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు తెలుగులో చేసిన సినిమాలతో మంచి విజయాలు అందుకున్న దుల్కర్.. రాబోయే చిత్రాలతోనూ అదే సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగిస్తాడా అనేది వేచిచూడాలి.