Tragedy : దుబాయ్‌లో తెలంగాణ వాసులపై జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన సర్గం శ్రీనివాస్ అనే వ్యక్తి, ఓ పాకిస్తానీ వ్యక్తి చేతిలో కత్తితో దాడికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం సెలవు సందర్భంగా ఓ బేకరీలో పని చేస్తున్న సమయంలో శ్రీనివాస్, నిర్మల్‌కు చెందిన ప్రేమ్ సాగర్, నిజామాబాద్‌కు చెందిన మరో శ్రీనివాస్ అనే వ్యక్తి చిట్ చాట్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ పాకిస్తానీ వ్యక్తి ఒక్కసారిగా విరుచుకుపడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ధర్మపురి శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ అక్కడికక్కడే మృతి చెందగా, నిజామాబాద్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్తానీ దుండగుడు దాడి చేసే సమయంలో ప్రత్యేక నినాదాలు చేస్తున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఇదంతా పని చేసే స్థలమైన బేకరీలోనే జరిగింది. మృతులు ముగ్గురూ అక్కడ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, కిషన్ రెడ్డి వెంటనే స్పందించారు. వీరంతా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడి, మృతదేహాలను తక్షణమే స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరుగేలా చూస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో స్పందించి, బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.