పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు మేదినీపూర్ జిల్లాలోని కాంతి ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక యువకుడు ఏడేళ్ల మహిళ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. స్థానికులు సమాచారం ప్రకారం.. ఏడు సంవత్సరాల క్రితం కాంతి ప్రాంతంలో ఒక స్థానిక మహిళను ఖననం చేశారు. తాజాగా అదే స్త్రీ అస్థిపంజరాన్ని ఆ యువకుడు సమాధి నుంచి తవ్వి బయటకు తీశాడు. అనంతరం అతను అస్థిపంజరంతో నిలబడి సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించాడు. ఇది చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఆ యువకుడిని ప్రభాకర్ సీతగా గుర్తించారు.
READ MORE: Nambala Keshava Rao: బీటెక్ టు నక్సలిజం.. 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే!
ఈ ఘటన తర్వాత ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులు అతన్ని పోలీసులకు అప్పగించడానికి నిరాకరించారు. దీంతో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తోపులాట జరిగిందని, స్థానికులు పోలీసులపై ఇటుకలు విసిరినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దాదాపు రెండు గంటల పాటు గ్రామస్థులతో మాట్లాడిన పోలీసులు.. చివరకు జనసమూహాన్ని నియంత్రించి, తీవ్రంగా గాయపడిన యువకుడిని కాంతి ఉపజిల్లా ఆసుపత్రిలో చేర్చారు.
READ MORE: China- Pakistan: భారత్ పాక్ ఉద్రిక్తత మధ్య.. పాకిస్థాన్, చైనా మధ్య కీలక ఒప్పందం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువకుడు మద్యం మత్తులో ఉన్నాడు. అతని వద్ద ఓ మద్యం బాటిల్ కూడా దొరికింది. ప్రాథమిక దర్యాప్తులో ఆ యువకుడు గతంలో వేరే రాష్ట్రంలోని ఓ హోటల్‌లో పనిచేసేవాడని, మద్యానికి బానిసైన కారణంగా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారని తేలింది. అతను ఆ మహిళ అస్థిపంజరాన్ని ఎందుకు తవ్వి తీశాడో అనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
