NTV Telugu Site icon

Drugs Case: రూ. 2,000 కోట్ల డ్రగ్స్ రాకెట్‌.. మాస్టర్‌మైండ్‌ సినీ నిర్మాత!

International Drug Trafficking Racket

International Drug Trafficking Racket

International Drug Trafficking Racket: భారత దేశంలో మరోసారి అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలను తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాన్ని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడట.

అంతర్జాతీయ స్థాయిలో సూడోఫెడ్రిన్‌కు భారీగా డిమాండ్‌ ఉంది. మెథాంఫేటమిన్‌ తయారీలో సూడోఫెడ్రిన్‌ను వినియోగిస్తారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, మలేషియాలో కిలో రూ.1.5 కోట్లకు విక్రయిస్తున్నారు. ఆ మూడు దేశాలకు పెద్ద మొత్తంలో సూడోఫెడ్రిన్‌ పంపుతున్నట్లు ఎన్‌సీబీకి సమాచారం తెలిసింది. సూడోఫెడ్రిన్‌ను హెల్త్‌ మిక్స్‌ పొడులు, కొబ్బరి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిపి సముద్ర మార్గంలో రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మాదకద్రవ్యాల మాఫియా కదలికలపై ఎన్‌సీబీ నిఘా పెట్టింది. సరకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read: Vijay Sankalp Yatra: నేడు తెలంగాణకు గుజరాత్ సీఎం.. కిషన్ రెడ్డి షెడ్యూల్ ఇదే..!

ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ అధికారులు ఫిబ్రవరి 15న పశ్చిమ ఢిల్లీలోని దారాపుర్‌లోని గోదాంలో సోదాలు నిర్వహించి 50 కిలోల సూడోఫెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ డ్రగ్ నెట్‌వర్క్‌ భారత్‌ సహా మలేసియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు విచారణలో తేలింది. ఈ ముఠా ఇప్పటి వరకు 3500 కిలోల సూడోఫెడ్రిన్‌ ఉన్న 45 పార్శిళ్లను ఎగుమతి చేసిందని, వాటి విలువ రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందని తేలింది. డ్రగ్స్ అక్రమ స్వాధీనం, వ్యాపారం చేయడంతో నిందితులకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.

Show comments