NTV Telugu Site icon

Off The Record: బీఆర్ఎస్‌లో ఆ నేతల మధ్య ఢీ తప్పదా..? డోర్నకల్ ఏం జరగబోతుంది..?

Dornakal

Dornakal

వాళ్లిద్దరూ ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్ధులు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. అయినా… ఛాన్స్‌ దొరికినప్పుడల్లా కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. ఒకరు మంత్రి అయితే మరొకరు మాజీ మంత్రి. ఆ ఇద్దరూ.. ఇప్పుడు ఒక అసెంబ్లీ నియోజకవర్గం కోసం పావులు కదుపుతున్నారు. ఎవరా ఇద్దరు? ఏదా నియోజకవర్గం?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఎస్టీ రిజర్వుడు స్థానమైన ఈ సెగ్మెంట్‌లో అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరం మూడు దశాబ్దాలకు పైగా సాగుతోంది. ప్రస్తుతం ఆ ఇద్దరు అధికార పార్టీలోనే ఉన్నా రాజకీయ వైరం మాత్రం తగ్గడంలేదు. తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ మధ్య అధిపత్యపోరు తార స్థాయికి చేరిందట.

Also Read : Harish Rao : సభా వేదికగా క్షమాపణలు చెప్పిన మంత్రి హరీష్‌ రావు

ఒకప్పుడు సత్యవతి రాథోడ్ టీడీపీ నుంచి, రెడ్యానాయక్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా తలపడ్డారు. 1989 నుంచి 2018 వరకు డోర్నకల్ నియోజకవర్గానికి ఏడుసార్లు ఎన్నికలు జరగ్గా.. ఆరు విడతలు రెడ్యానాయక్ ఎమ్మెల్యే అయ్యారు. మూడుసార్లు సత్యవతి రాథోడ్‌తో తలపడ్డారాయన. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సత్యవతి రాథోడ్ 2013లో బీఆర్ఎస్‌లో చేరి 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా రెడ్యానాయక్‌పై పోటీచేశారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్యా విజయం సాధించి తర్వాత బీఆర్‌ఎస్‌ గూటికే చేరిపోయారు. 2018లో బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు కేసీఆర్‌. ఆ తర్వాత కొద్ది నెలలకే తొలి గిరిజన మహిళా మంత్రిగా క్యాబినెట్‌లో బెర్త్‌ ఇచ్చారు. అదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యే అయిన రెడ్యానాయక్‌ను షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు.

గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఎవరికి ఎవరూ తీసిపోమన్నట్టు వ్యవహరిస్తున్నారట. డోర్నకల్‌ మీద పట్టు బిగించేందుకు ఎవరి రేంజ్‌లో వారు ప్రయత్నిస్తున్నారట. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రెడ్యా సందర్బం వచ్చినప్పుడల్లా… సత్యవతి రాథోడ్‌ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారట. మంత్రి వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ నుంచి టికెట్‌ ఆశిస్తుండడంతో ఇద్దరి మధ్య గ్యాప్‌ మరింత పెరిగిందట. మూడుసార్లు డోర్నకల్ నుంచి పోటీచేసి ఒక్కసారే గెలిచిన సత్యవతి నాలుగోసారి మంత్రి హోదాలో అక్కడి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారట. దీంతో ఆమెకు చెక్‌పెడుతూ రెడ్యా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారట. ఇద్దరు నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు స్థానికంగా బీఆర్‌ఎస్‌ కేడర్‌ని కంగారపెడుతున్నాయట. అధిష్టానం ఆదేశిస్తే డోర్నకల్ నుంచి పోటీకి సిద్ధమని మంత్రి హైదరాబాద్‌లో చెప్పడం, సీటు కోసం గుంటనక్కలు కాచుకుని ఉన్నాయని రెడ్యా కా=మెంట్‌ చేయడం లాంటివి నియోజకవర్గంలో సమ్మర్‌ హీట్‌కంటే ఎక్కువగా సెగలు పుట్టిస్తున్నాయట. కొందరు నా చావు కోసం ఎదురు చూస్తున్నారని ఇటీవల ఒక ఆత్మీయ సమావేశంలో ఆయన చెప్పడం మరింత కాక రేపింది. మొత్తంగా చూస్తే… డోర్నకల్‌ బీఆర్‌ఎస్‌ సీటు కోసం సిగపట్లు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు అధిష్టానం దగ్గర పట్టున్న నేతలే కావడంతో…ఫైనల్‌గా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.