Nobel Prize 2025: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి వస్తుందా ఈసారి. నోబెల్ బహుమతిని చేజిక్కించుకోవాలనేది అగ్రరాజ్యాధిపతి ట్రంప్ ఆశ. ఇక్కడ విశేషం ఏమిటంటే నోబెల్ బహుమతి ప్రకటన అక్టోబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 10న నోబెల్ శాంతి బహుమతి అందజేస్తారు. ఈ బహుమతి ఎవరు గెలుచుకుంటారా అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతిపై ఆశ ఉంది. ఇప్పటివరకు నిపుణుల నుంచి అందిన సూచనల ప్రకారం.. ఈ నోబెల్ బహుమతి ట్రంప్ చేతుల నుంచి జారిపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఇంతకీ మనోడి కల చెదిరిపోడానికి కారణమైన 10 కారణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Trump: గాజాలో అధికారాన్ని విడిచిపెట్టండి.. లేదంటే నాశనం అవుతారు.. హమాస్‌కు మరోసారి ట్రంప్ హెచ్చరిక
1. నోబెల్ శాంతి బహుమతికి ఎవరినైనా నామినేట్ చేయడానికి చివరి తేదీ జనవరి 31, 2025. అంటే జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడైన 11 రోజుల తర్వాత. అయితే నెతన్యాహు, పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఇతర దేశాల నాయకులు ట్రంప్ పేరును చాలా ఆలస్యంగా నామినేట్ చేశారు. దీంతో ట్రంప్ నామినేషన్ జరిగిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
2. ఏడు యుద్ధాలను ఆపినట్లు చెబుతున్న ట్రంప్ వాదనలు ఎంతవరకు కచ్చితమైనవి అనేవి స్పష్టంగా తెలియదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం – పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ ఆదేశించినట్లు ఆయన చెబుతున్నారు. కానీ భారతదేశం ఈ వాదనను తీవ్రంగా ఖండించింది. పాక్ విజ్ఞప్తి చేసిన తర్వాత ఆపరేషన్ సింధూర్‌ను నిలిపివేసినట్లు ప్రధాని మోదీ పార్లమెంటులో స్పష్టంగా పేర్కొన్నారు.
3. అర్మేనియా-అజర్‌బైజాన్ యుద్ధం: ఇటీవల సమయంలో అర్మేనియా – అజర్‌బైజాన్ మధ్య వివాదం మళ్లీ చెలరేగింది. ఈ సమయంలో ట్రంప్ ఇద్దరు నాయకులను శాంతి చర్చలు జరపడానికి వాషింగ్టన్‌కు పిలిపించారు. కానీ ఈ ఇద్దరు నాయకులు ఆ సమయంలో ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయలేదు. రెండు దేశాల మధ్య ఈ సరిహద్దు వివాదం చాలా కాలంగా ఉంది, ఈ దేశాల మధ్య కాల్పులు తరచుగా జరుగుతాయి.
4. కంబోడియా – థాయిలాండ్: కంబోడియా – థాయిలాండ్ మధ్య ఉన్న ఒక పురాతన శివాలయం సమీపంలో సరిహద్దు విషయంలో ఇటీవల మళ్లీ వివాదం చెలరేగింది. ఈ వివాదంలో F-16 యుద్ధ విమానాలను కూడా ఉపయోగించారు. అయితే ట్రంప్ వాదనకు విరుద్ధంగా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణను ASEAN ప్రారంభించింది.
5. సెర్బియా-కొసావో, రువాండా – కాంగో మధ్య చాలా కాలంగా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వీటి మధ్య శాశ్వత శాంతి ఎప్పుడూ సాధ్యం కాలేదు. ఈజిప్ట్ – ఇథియోపియా మధ్య యుద్ధం జరగలేదు, బదులుగా నీటి వివాదం మాత్రమే జరిగింది. తత్ఫలితంగా ట్రంప్ వాదనలు ఇక్కడ కూడా బలంగా లేవు.
6. ఇజ్రాయెల్ – పాలస్తీనా: గాజా స్ట్రిప్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ హమాస్, అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై భారీ దాడిని ప్రారంభించింది. 119 ప్రదేశాల నుంచి ఆరు వేల మంది హమాస్ యోధులు ఇజ్రాయెల్ సరిహద్దులోకి చొరబడి, నాలుగు వేలకు పైగా రాకెట్లను పేల్చారు. ఈ దాడిలో విదేశీ పౌరులు సహా 1,200 మంది ఇజ్రాయెలీయులను చంపగా, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకున్నారు. గాజా స్ట్రిప్‌లో దీనికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన దాడిలో సుమారుగా 60 వేల మందికి పైగా పౌరుల మరణానికి దారితీసింది. ప్రస్తుతం గాజా శాంతి ప్రణాళిక కూడా ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. ట్రంప్ నిరంతరం ఇజ్రాయెల్ వైఖరికి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
7. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడంలో వైఫల్యం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత ప్రయత్నించినా రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపలేకపోయారు. అలాస్కా శిఖరాగ్ర సమావేశం తరువాత ట్రంప్ ఉక్రెయిన్ తన భూభాగంలో 20% రష్యాకు అప్పగించాలనే వింత సూచనను చేశారు. ఇది ఒక దేశ సార్వభౌమాధికారంపై దాడి వంటిదని విశ్లేషకులు చెబుతున్నారు.
8. దేశీయ రంగంలో ఎదురుదెబ్బ: నార్వే నోబెల్ బహుమతి ఎంపిక కమిటీ అంతర్జాతీయ సంస్థలు, చట్టాలు, ప్రజాస్వామ్య విలువలపై చాలా శ్రద్ధ చూపుతుంది. ఇది దేశీయ రంగంలో అభ్యర్థుల పనితీరును కూడా అంచనా వేస్తుంది. అయితే అక్రమ వలసదారులను అరికట్టడానికి డెమొక్రాటిక్ ఆధీనంలో ఉన్న రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్‌ను మోహరించడం వంటి ట్రంప్ చర్యలు, హార్వర్డ్ వంటి ఉన్నత విద్యా సంస్థలకు నిధులను నిలిపివేయడం వంటి చర్యలు కూడా ఆయన అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బ కొట్టినట్లు ప్రచారం జరుగుతుంది.
9. ట్రంప్ వింత చర్యలు: అంతర్జాతీయ భద్రత పేరుతో కెనడా నుంచి గ్రీన్‌ల్యాండ్‌ను డిమాండ్ చేయడం, వాతావరణ మార్పును పెద్ద మోసంగా పిలవడం, ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్ వంటి సంస్థలపై దాడి చేయడం, మాస్కో-కీవ్ యుద్ధంలో ఇజ్రాయెల్‌తో చేరడం, ఇరాన్‌పై భారీ దాడిని ప్రారంభించడం, ట్రంప్ ఏకపక్ష సుంకాలు ప్రపంచ వాణిజ్యం, బహిరంగ వాణిజ్య విధానాలను దెబ్బతీశాయి.
10. బహిరంగంగా బెదిరింపులు: ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి అందకపోతే అది అమెరికాకు అవమానం అని ఒక సందర్భంలో అన్నారు. అయితే అమెరికా ఫస్ట్ ఆధారంగా విభజన విధానాలను ప్రోత్సహించే ట్రంప్‌కు నోబెల్ గెలవడానికి చాలా తక్కువ అవకాశం ఉందని ఓస్లోలో నోబెల్ శాంతి బహుమతి ఎంపికలో పాల్గొన్న నిపుణులు అంటున్నారు. నోబెల్ బహుమతిపై ఒక పుస్తకం రాసిన చరిత్రకారుడు ఓయ్వింద్ స్టెయినర్సన్.. ట్రంప్ వైఖరి ఈ శాంతి బహుమతికి నిర్దేశించిన ప్రమాణాలకు చాలా విధాలుగా విరుద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది.. నోబెల్ శాంతి బహుమతి కోసం338 మంది వ్యక్తులు, సంస్థలు నామినేట్ అయ్యాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే గత 50 ఏళ్లుగా నోబెల్ బహుమతి కోసం నామినెట్ అయిన వారి పేర్లను గోప్యంగా ఉంచే సంప్రదాయం ఉంది.
ఇప్పటి వరకు నలుగురు అమెరికా అధ్యక్షులకు బహుమతి..
ఇప్పటి వరకు నలుగురు అమెరికా అధ్యక్షులు నోబెల్ బహుమతిని అందుకున్నారు. 1906లో థియోడర్ రూజ్‌వెల్ట్, 1919లో వుడ్రో విల్సన్, 2002లో జిమ్మీ కార్టర్, 2009లో బరాక్ ఒబామా. ఒబామా తన పదవీకాలంలో తొమ్మిదవ నెలలోనే నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ట్రంప్ కూడా ఇలాంటి కలనే కలలు కంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ ట్రాక్ రికార్డ్ భిన్నమైనది..
నార్వేజియన్ నోబెల్ కమిటీలో ఐదుగురు సభ్యుల బృందం ఉంది. ఈ బృందం శాంతి ప్రయత్నాల స్థిరత్వం, ప్రపంచ సోదరభావాన్ని ప్రోత్సహించడం, ప్రపంచ సంస్థలను బలోపేతం చేయడం వంటి అంశాలపై దృష్టిసారించి అవార్డును ప్రదానం చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ట్రంప్ రికార్డు భిన్నంగా ఉంది. నోబెల్ విషయంపై ఆయన నార్వేజియన్ ప్రభుత్వంతో కూడా నేరుగా మాట్లాడారనే వాదనలు వస్తున్నాయి. 2018 నుంచి ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అనేకసార్లు నామినేట్ అయ్యారు. పలువురు మాజీ నోబెల్ గ్రహీతలు మాట్లాడుతూ.. దౌత్య ప్రయత్నాల హడావిడికి దూరంగా, బహుపాక్షిక శాంతి ప్రయత్నాలపై కమిటీ దృష్టి సారిస్తుందని చెబుతున్నారు. ఎంపిక కమిటీకి ఎటువంటి ఒత్తిడికి లొంగడం ఇష్టం లేదని పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో డైరెక్టర్ నినా గ్రెగర్ చెప్పారు.
అక్టోబర్ 6న వైద్య రంగంలో నోబెల్ బహుమతిని ప్రకటిస్తారు. అక్టోబర్ 7న భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి, 8న రసాయన శాస్త్రంలో, 9న సాహిత్యంలో, 10న నోబెల్ శాంతి బహుమతిని, 13న నోబెల్ మెమోరియల్ బహుమతి (ఆర్థిక శాస్త్రాలు)ను ప్రకటిస్తారు.
READ ALSO: RRB NTPC 2025: రైల్వేలో కొలువుల జాతర.. 8850 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల
