Dog Squad: విశాఖపట్నం మీదుగా ఇకపై గంజాయి తరలించాలంటే కాస్త ఆలోచించుకోవాల్సిందే.. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసుల కళ్లు కప్పి, చెక్ పోస్టులకు మస్కా కొట్టి తరలిస్తున్న గంజాయిని పట్టుకునేందుకు బలమైన డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఏ మూలనైనా, ఏ మూటలో నైనా సరే గంజాయి వాసన గుప్పు మంటే చాలు గుట్టు రట్టు చేసేందుకు రంగం సిద్దం చేసారు పోలీసులు… నగర పోలీస్ కమిషనరేట్ పరిధి ఏఆర్ బారె క్స్లో రూ.18 లక్షలతో నిర్మించిన నాలుగు డాగ్ కెన్నెల్స్ ను జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస రావు, సీపీ శంఖబ్రతబాగ్చి ప్రారంభించారు. రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా, ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన విశాఖకు ప్రముఖుల తాకిడి ఉంటుందన్నారు. తరచూ జాతీయ, అంతర్జాతీయస్థాయి సదస్సులు జరుగుతున్నందున ప్రముఖుల భద్రత, గంజాయి, మాదకద్రవ్యాలకు అడ్డుకట్టవేయాల్సి ఉందన్నారు. భద్రతకు అవసరమైన డాగ్స్‌తో పాటు సౌకర్యాలను కల్పించడం కోసం జీవీఎంసీ పోలీస్ శాఖకు సహకరిస్తోందన్నారు.
Read Also: AP Free Bus Effect : “జనాల మధ్య మా ఊపిరి ఆగిపోయేలా ఉంది” కండక్టర్ కుసుమ కుమారి సెల్ఫీ వీడియో వైరల్!
ప్రస్తుతం 17 డాగ్ కెన్నెల్స్, 21 డాగ్ స్క్వాడ్స్ ఉండగా, కొత్తగా నిర్మించిన నాలుగు కెన్నెల్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. 21 డాగ్ స్క్వాడ్స్ తో నగరం ఇప్పటికే రాష్ట్రంలో అతిపెద్ద డాగ్ స్క్వాడ్ కలిగిన కమిషనరేట్‌గా గుర్తింపు పొందిందన్నారు. 21 డాగ్స్ లో రెండు నేరగాళ్లను పట్టుకోవడంలో శిక్షణ పొందిన ట్రాకర్స్, ప్రముఖుల పర్యటనల సందర్భంగా బాంబులు, మందుపాతరలను గుర్తించేందుకు ఉపయోగించే ఎక్స్ ప్లోజివ్స్ డాగ్స్, మాదకద్రవ్యాలను పసిగట్టడంలో సహాయపడే నార్కోటిక్ డాగ్స్ 10 ఉన్నాయన్నారు. ఇవికాకుండా మత్తు పదార్థాలను గుర్తించడంలో శిక్షణ పూర్తిచేసుకున్న మూడు డాగ్స్ ఇటీవల చేరాయన్నారు. ఇక, గాడ్స్‌ను హ్యాండిల్ చేసేందుకు 26 మంది శిక్షణ పొందిన హ్యాండ్లర్స్ ఉన్నారన్నారు సీపీ శంఖబ్రతబాగ్చి..
