Towel Inside Stomach: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు సిజేరియన్ నిర్వహించిన వైద్యులు గర్భంలో టవల్ పెట్టి అలాగే కుట్లు వేసిన ఘటన యూపీలోని అమ్రోహాలో జరిగింది. అమ్రోహాలోని ఓ ఆస్పత్రిలో ప్రసవ వేదనతో గర్భిణీ చేరగా.. వైద్యుడు ఆపరేషన్ చేసి టవల్‌ను కడుపులో మర్చిపోయాడు. ఈ కేసుపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) రాజీవ్ సింఘాల్ సమగ్ర విచారణక ఆదేశించారు.
చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమ్రోహాలోని నౌగావానా సాదత్ పీఎస్ పరిధిలో డాక్టర్ మత్లూబ్ అనుమతి లేకుండా సైఫీ నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నాడు. ప్రసవ వేదనతో వచ్చిన ఓ మహిళకు ఆయన ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం కడుపులో టవల్‌ను పెట్టి అలాగే కుట్లు వేశాడు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా టవల్ కడుపులో ఉండిపోయింది. ఆ మహిళ కడుపు నొప్పి అని చెప్పడంతో ఆ వైద్యుడు ఆమెను ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స చేయించుకోవాలని చెప్పాడు. బయట చలి కారణంగా ఆమె ఈ కడుపు నొప్పిని ఎదుర్కొంటుందని పేర్కొన్నాడు.
Hyderabad Crime: బైక్ నంబర్ ప్లేట్‌కు ఫేస్ మాస్క్.. కానీ మూల్యం చెల్లించక తప్పలేదు..
ఐదు రోజుల తర్వాత వారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినా ఆరోగ్యం బాగోకపోవడంతో ఆ మహిళ భర్త షంషేర్ అలీ ఆమెను అమ్రోహాలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కడుపునొప్పి వెనుక అసలు నిజం బయటపడింది. కడుపులో టవల్ ఉందని తెలుసుకుని వైద్యులు మరో ఆపరేషన్ చేసి టవల్ తీసేశారు. ప్రైవేట్ డాక్టర్ మత్లూబ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ షంషేర్ అలీ సీఎంఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురించి తనకు మీడియా నివేదికల ద్వారా తెలిసిందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) రాజీవ్ సింఘాల్ వెల్లడించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని నోడల్ అధికారి డాక్టర్ శరద్‌ను కోరానన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే మరిన్ని వివరాలను చెప్పగలమని సీఎంవో సింఘాల్ మంగళవారం తెలిపారు. అయితే, షంషేర్ అలీ ఈ వ్యవహారంపై ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదని, విచారణ జరుగుతుందని సీఎంవో హామీ ఇచ్చారు. సీఎంవో విచారణ నివేదిక రాగానే పోలీసులు విచారణ ప్రారంభిస్తారని పేర్కొనడం గమనార్హం.