కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాక ముఖ్యమంత్రి పీఠంపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య పోటీ తప్పలేదు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం సిద్దరామయ్యకే సీఎం పీఠం అప్పగించి డీకేకు ఉప ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ కు సీఎం పదవి రాకపోవడంపై పలువురు కాంగ్రెస్ నేతలు గతంలో బాహాటంగానే అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా అధికార మార్పిడిపై డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కన్నడ కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
READ MORE: Jharkhand: హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ.. 11 మంది మంత్రులుగా ప్రమాణం
ముఖ్యమంత్రి పదవి విషయంలో రహస్య ఒప్పందం ఏదో కుదిరినట్లు వస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్లీ అధికార పంపిణీ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో డిప్యూటీ సీఎం డీకే మాట్లాడుతూ.. “అధికార పంపిణీ ఒప్పందం జరిగిన విషయం వాస్తవమే. ఆ వివరాలను బహిర్గతం చేయలేను. దీనిపై అధిష్ఠానాన్ని నేను బ్లాక్‌మెయిల్ చేయను. నేను గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిని. అందులో మరో మాట లేదు.” అని డీకే తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, తనకు ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవని మరోసారి స్పష్టం చేశారు.
READ MORE: Minister Sridhar Babu: తెలంగాణకు రూ.2వేల కోట్ల కొత్త పెట్టుబడులు.. పెద్ద సంఖ్యలో పరిశ్రమలు
కాగా.. శివకుమార్ వ్యాఖ్యలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. అధికార పంపిణీకి సంబంధించి ఎటువంటి ఒప్పందాలు జరగలేదని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు తనకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మధ్య అధికారం పంచుకోవడంపై ఎలాంటి ఒప్పందం జరగలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చిచెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.