NTV Telugu Site icon

Karnataka: కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ.. డీకేకు బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేనా?

Karnataka

Karnataka

Karnataka: కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి నూతన ముఖ్యమంత్రి ఎంపిక పెద్ద సవాల్‌గా మారింది. ప్రాంతం, కులం, సీనియారిటీ, ఎమ్మెల్యేల మనోగతం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి పదవికి ఎవరన్నది కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేయనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును నిర్ణయించడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమవడంతో ఇద్దరు ప్రధాన పోటీదారులు-డీకే శివకుమార్, సిద్ధరామయ్య- పార్టీ హైకమాండ్‌తో వివరణాత్మక చర్చ కోసం సోమవారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
ఇద్దరు కరాటక ప్రముఖులు ఢిల్లీ నేతలను వ్యక్తిగతంగా కలుసుకునేలా పార్టీ హైకమాండ్ కోరుకుంటుందని, తద్వారా సజావుగా పరివర్తన జరిగేలా నిర్ణయాన్ని వారికి తెలియజేయవచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. నేడు డీకే శివకుమార్‌ పుట్టిన రోజు కాగా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు ముఖ్యమంత్రి పదవిని గిఫ్ట్ ఇస్తుందా లేదా అన్న టెన్షన్‌లో డీకే అనుచరులు ఉన్నారు. తన పుట్టిన రోజు నాడు సోనియాకు గెలుపు గిఫ్ట్ ఇస్తానని గతంలో చెప్పిన డీకే శివకుమార్‌.. చెప్పినట్లు గానే కర్ణాటక ఎన్నికల్లో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని కట్టబెట్టారు. డీకే శివకుమార్‌కు అధిష్ఠానం ఊహించని గిఫ్ట్ ఇస్తుందని సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు చేస్తున్నారు.

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కోరింది. బెంగళూరులోని షాంగ్రీలా హోటల్‌లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో రహస్య ఓటింగ్ జరిగిందని గతంలో వివాదాస్పద వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాది కూడా సీక్రెట్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ద్వారా సీఎం అభ్యర్థిని ఎంపిక చేశారన్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎట్టకేలకు కర్ణాటక సీఎం ఎంపిక బాధ్యతలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేశారు.బెంగళూరులోని షాంగ్రీలా హోటల్‌లో జరిగిన సీఎల్పీ సమావేశం సందర్భంగా డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మద్దతుదారులు హోటల్ వద్దకు వచ్చి తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇద్దరు నేతల మద్దతుదారులు హోటల్ గేటు వద్ద ఒకరినొకరు అరుచుకునేందుకు ప్రయత్నించారు. ఆదివారం అర్థరాత్రి ప్రారంభమైన సమావేశం అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగింది. దీనికి కొత్తగా ఎన్నికైన 135 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Read Also: Pinarayi Vijayan: తగిన గుణపాఠం చెప్పారు.. కర్ణాటక ఎన్నికలపై కేరళ సీఎం కీలక వ్యాఖ్యలు

ఆదివారం నాటి సీఎల్పీ సమావేశానికి చాలామంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. దాంతో నూతన సభ్యులందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు భేటీ సోమవారం కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. సిద్దరామయ్యకు 75 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా 40 మంది డీకే శివకుమార్‌ వెంట ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలో వారిద్దరూ సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా సూత్రంపైనా ఆదివారం భేటీలో చర్చించారు. సిద్ధరామయ్య, డీకే సోమవారం ఢిల్లీ వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ, రాహుల్‌ సమక్షంలో సీఎం అంశం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ తన పుట్టినరోజు సందర్భంగా సిద్ధరామయ్య, రణదీప్ సింగ్ సూర్జేవాలా, ఇతర కాంగ్రెస్ నాయకులతో ఉన్నారు. ఆదివారం రాత్రి శివకుమార్ తన పుట్టినరోజును సిద్ధరామయ్య. ఇతర పార్టీ సహచరులతో కలిసి జరుపుకుంటున్న చిత్రాన్ని ట్వీట్ చేశారు. “నా జీవితం కర్ణాటక ప్రజలకు సేవ చేయడానికే అంకితం. నా పుట్టినరోజు సందర్భంగా, కర్ణాటక ప్రజలు నాకు సాధ్యమైనంత ఉత్తమమైన పుట్టినరోజు బహుమతిని ఇచ్చారు. శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్‌ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు’ అని శివకుమార్‌ ట్వీట్‌ చేశారు.