గత కొద్ది రోజులుగా నీటి సంక్షోభంతో బెంగళూరు వాసులు అల్లాడిపోతున్నారు. కనీస అవసరాలు తీరక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొనేందుకు కూడా చాలా చోట్ల నీళ్లు లభించక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నీటి లభ్యతపై తాజాగా డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ స్పందించారు.
రాజధాని నగరం బెంగళూరులో నీటి సంక్షోభం లేదని డిప్యూటీ సీఎం తేల్చిచెప్పారు. నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు.
బెంగళూరు ఎలాంటి నీటి ఎద్దడి లేదని పేర్కొన్నారు. సుమారు 7 వేల బోర్లు ఎండిపోయాయని చెప్పారు. అయితే ఆ సమస్యను ఎదుర్కొనేందుకు మేం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. నీటి వనరులను గుర్తించామని.. ట్యాంకర్లతో నీరు సరఫరా జరిగేలా చూస్తామని ఆయన వెల్లడించారు.
గతంలో డీకే.శివకుమార్ మరోలా స్పందించారు. తన నివాసంలో కూడా బోరు ఎండిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్భిక్ష పరిస్థితిని గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చూడలేదన్నారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు.
బెంగళూరులో నీటి కొరతను తీర్చలేని పరిస్థితులకు కేంద్రంలోని బీజేపీ కూడా కారణమేనంటూ గతంలో ఆయన ఆరోపించారు. నగరంలో మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని పాదయాత్ర చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే నగరంలోని వాటర్ మాఫియాకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాలను శుభ్రం చేసేందుకు, వినోదాలకు నీటిని వృథా చేసిన వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని ఇప్పటికే స్థానిక యంత్రాంగం హెచ్చరించింది.
