Site icon NTV Telugu

DK Shivakumar: కర్ణాటకలో కొనసాగుతున్న పవర్ షేరింగ్ వివాదం.. డీకే శివకుమార్ సంచలన ట్వీట్

Dk Shivakumar

Dk Shivakumar

DK Shivakumar: కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ విషయంలో హై కమాండ్ అన్ని రకాలుగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇటీవల సీఎం సిద్ధరామయ్య ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ట్వీట్ చేశారు. తమ మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. జడ్జి అయినా, అధినేత అయినా, నేనైనా ఎవరయినా సరే మాట నిలబెట్టుకోవాల్సిందే అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం శివకుమార్ పోస్ట్ వైరల్‌గా మారింది.

READ MORE: Manchu Lakshmi: కుటుంబ కలహాల‌పై.. మొదటిసారి స్పందించిన మంచు లక్ష్మి

రోజు రోజుకూ వేడెక్కుతున్న వివాదం..!
కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార పంపిణీ వివాదం రోజు రోజుకూ వేడెక్కుతోంది. హైకమాండ్ డీకే శివకుమార్‌ను 2.5 సంవత్సరాలు వేచి ఉండమని గతంలో ఒప్పించగలిగినట్లు తెలిసింది. అయితే.. ఇప్పుడు సిద్ధరామయ్య తన వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించలేకపోతుందనే వాదన మొదలైంది. 2023లో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో 2.5 సంవత్సరాలు సీఎంగా ఉండాలని ఒప్పంద కుదిరినట్లు కాంగ్రెస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ రహస్య చర్చలో శివకుమార్ మొదటి రెండునరేళ్ల పదవీకాలం డిమాండ్ చేశారు.. కానీ సిద్ధరామయ్య సీనియారిటీని పేర్కొంటూ తనకే మొదటి విడత సీఎం పదవి కావాలని పట్టుబట్టారు. సుదీర్ఘ చర్చ తర్వాత, రాజీ కుదిరింది.

READ MORE: Supreme Court: ఆధార్ కార్డుంటే ఓటు వచ్చేస్తుందా? చొరబాటుదారులపై సుప్రీంకోర్టు ఆందోళన

దీంతో మొదటి విడతలో భాగంగా సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ కాలక్రమేణా, సిద్ధరామయ్య వైఖరి మారిపోయింది. జూలై 2025 వరకు.. “పూర్తి ఐదు సంవత్సరాలు నేనే సీఎంగా కొనసాగుతాను.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు” అని పదే పదే చెప్పారు. అయితే, నవంబర్ 22న మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమైన తర్వాత.. సిద్ధరామయ్య స్వరం మారిపోయింది. ఈ నిర్ణయాన్ని హైకమాండ్‌కు వదిలేశారు. ఒకవేళ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినా.. పార్టీకి చెందిన కీలక బాధ్యతలను సిద్ధరామయ్యకు కట్టబెడతారని పార్టీ అధికారుల సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్య దాదాపు ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఒకటిన్నర సంవత్సరాలు సమన్వయ కమిటీ అధిపతిగా పనిచేశారు. కాబట్టి, ఆయనకు తిరిగి పార్టీ బాధ్యతలను అప్పగించడం నైతికంగా అవసరమని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. డీకే శివకుమార్ నైపుణ్యం, ఓపికతో వేచి చూస్తున్నారు. కర్ణాటకలో అధికార సమతుల్యత రాజస్థాన్ లేదా ఛత్తీస్‌గఢ్ లాగా లేదని పార్టీలోనే ఆయనకు గుర్తింపు ఉంది. కాగా.. ఈ 2.5 సంవత్సరాల ఒప్పందం ఫలిస్తుందా..? భారత రాజకీయాల్లో మరో అసంపూర్ణ కథగా మిగిలిపోతుందా అనేది రాబోయే వారాల్లో తేలనుంది.

Exit mobile version