దీపావళి… ఆనందాల కేళి.. దీపావళి పేరు చెబితే పిల్లలు ఎగిరి గంతేస్తారు… అయితే, ఈసారి దీపావళి ఎప్పుడు జరుపుకోవాలనే సందిగ్ధత కొనసాగుతోంది. హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అనగానే ప్రతి ఇంట వెలుగులు విరజిమ్ముతాయి. ఈ పండగ కోసం ప్రతి ఒక్కరూ ఏడాది పొడవునా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
తిథి, నక్షత్రం ప్రకారం ఈ నెల 24న సోమవారం నాడు దీపావళి జరుపుకోవాలని చెబుతుంటే.. మరికొందరు 25వ తేదీ జరుపుకోవాలంటున్నారు. అమావాస్య రాత్రి తిథి ఉన్నందున అప్పుడే దీపావళి జరుపుకోవాలని మరికొందరు పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 24వ తేదీనే చతుర్దశి తిథి సాయంత్రం 5 గంటలలోపు ఉందని, ఆ తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంది. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం దాదాపు 4:20 గంటలకు అమావాస్య తిథి పూర్తవుతుంది. ఆ తర్వాత పాడ్యమి ప్రారంభమవుతుంది. దీపావళి పండుగకు ముందే చాలామంది ధనత్రయోదశి జరుపుకుంటారు. ఆ రోజున బంగారం కొనాలని అంటారు.
Read Also:Forex : ఆర్థిక నిల్వలకు ఇబ్బందిలేదు.. సమృద్ధిగా ఉన్నాయి
ఈసారి దీపావళికి ముందు రోజున 23వ తేదీన ధన త్రయోదశి ప్రారంభమవుతుంది. దీపావళి పర్వదినాన్ని ఈ నెల 24వ తేదీన జరుపుకోవాలని టీటీడీ ఆగమ సలహాదారు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆగమ విభాగం ఆచార్యులు శ్రీవిష్ణుభట్టాచార్యులు తెలిపారు. సోమవారం సూర్యాస్తమయానికి గంటముందుగా అమావాస్య ఘడియలు ప్రారంభమవుతుండడంతో అదే రోజున దీపావళి జరుపుకోవాలని ఆయన సూచించారు.
దీపావళి రోజున మీ ఇంట్లో దీపాలు వెలిగిస్తే ఎంతో శుభం జరుగుతుంది. మీ ఇల్లును, మీ ఆఫీసును శుభ్రం చేయాలి. దీంతో ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూలశక్తి వస్తుంది. దీపావళి నాడు ఇంట్లో ముఖ్యంగా వంటగది, స్టోర్ రూంను క్లీన్ చేయడం చాలామంది చేయరు. వాటిని శుభ్రంగా వుంచుకోవడం వల్ల లక్ష్మీదేవి కొలువై వుంటుందని పండితులు చెబుతున్నారు.
దీపావళి ముందు రోజే మీ ఇంట్లో పగిలిన వస్తువులు, ఫోటోలు, చినిగిన పుస్తకాలు, పనికిరాని బొమ్మలు వుంటే బయటపడేయాలి. ఇంటి ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతి. కాబట్టి ఉత్తర, ఈశాన్య దిశలను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోండి. ఉత్తరంలో వాస్తు దోషం ఉంటే మీరు ఎంత కష్టపడ్డా మీకు వచ్చే ఆదాయం నిలవదు. దీపావళి రోజున మీ ఇంటిని లైట్లు, పువ్వులు, రంగోలి, కొవ్వొత్తులతో డెకరేట్ చేయాలి. ఇంట్లో దీపాలు వెలుగుతుంటే.. ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని, ఆమె అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సాధ్యమయినంత కాలుష్యం తక్కువగా వుండే క్రాకర్స్ కాలిస్తే మంచిది.
Read Also: Bhakthi tv Live Stothra parayanam live: గురువారం నాడు ఈ స్తోత్రపారాయణం చేస్తే..