NTV Telugu Site icon

Shocking News: దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమానిని చంపేశారు..

Diwali Bonus

Diwali Bonus

Shocking News: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం దీపావళి బోనస్ ఇవ్వడానికి నిరాకరించినందుకు దాబా యజమానిని అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి బోనస్‌ను ఇవ్వడానికి యజమాని తిరస్కరించడంతో శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్ గ్రామీణ ప్రాంతంలోని కుహి ఫాటా సమీపంలోని ధాబా వద్ద అతని ఉద్యోగులు గొంతు కోసి, కత్తితో పొడిచి, కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఛోటు, ఆదిగా గుర్తించారు. మృతుడు రాజు దేంగ్రేగా గుర్తించారు. దాదాపు నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లోని లేబర్ కాంట్రాక్టర్ ద్వారా వీరిద్దరినీ రాజు ధెంగ్రే దాబాలో వర్కర్లుగా నియమించుకున్నాడని పోలీసులు తెలిపారు.

Also Read: Tragedy: దీపావళి వేళ అపశృతి.. పూరింటిపై తారాజువ్వ పడి మహిళ సజీవదహనం

దీపావళి రోజున డబ్బు, బోనస్ కోసం డిన్నర్ చేస్తున్న సమయంలో ఆది, చోటూతో ధెంగ్రే వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. రాజు ధెంగ్రే వారికి ఇంకేదైనా రోజు డబ్బు ఇవ్వడానికి అంగీకరించాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత, దేంగ్రే ఒక మంచం మీద నిద్రపోయాడు. అయితే అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో యజమానిని హతమార్చాలని కుట్ర పన్నిన నిందితులు.. అదేరోజు రాత్రి భోజనం అయ్యాక ధెంగ్రే నిద్రపోతున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. రాజు ధెంగ్రే నిద్రపోతుండగా.. మెడకు తాడును బిగించి.. ఆపై మొద్దుబారిన వస్తువుతో అతని తలపై కొట్టారు. పదునైన ఆయుధంతో అతని ముఖంపై దాడి చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత ధెంగ్రే మృతదేహాన్ని ఓ బొంతలో కప్పి నిందితులిద్దరూ అతడి కారులోనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో విహార్‌ గావ్‌ సమీపంలోని నాగ్‌పూర్‌-ఉమ్రెడ్ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టగా.. నిందితులిద్దరికీ గాయాలయ్యాయి. దీంతో కారు దిగి దిఘోరి వైపు పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.

Also Read: Radhika Kumaraswamy: అఘోరగా మారిన మాజీ సీఎం భార్య..

మరోవైపు, ధెంగ్రే కుమార్తె తన తండ్రికి ఫోన్ చేసింది, కానీ స్పందన లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో దాబా సమీపంలో ఉన్న పాన్ షాపు యజమానికి ఫోన్ చేసింది. అతని క్షేమం గురించి ఆరా తీసేందుకు దాబాకు చేరుకున్న పాన్‌ షాప్‌ యజమానికి మంచం మీద ధెంగ్రే మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, బాధితుడు, ధేంగ్రే, కుహి తాలూకాలోని సుర్గావ్ గ్రామానికి చెందిన మాజీ ‘సర్పంచ్’ (గ్రామాధికారి). ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఘటనకు సంబంధించి ఆ ప్రాంత ఎస్పీ హర్ష్ ఎ పొద్దార్ మాట్లాడుతూ.. హత్య వెనుక ప్రాథమిక కారణం ద్రవ్యపరమైన సమస్యగా కనిపిస్తోందని, అయితే ‘రాజకీయ వైరానికి సంబంధించిన కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని’ తెలిపారు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ పొద్దార్ తెలిపారు.